ఆంధ్రప్రదేశ్ నుంచి ఎన్నికయిన లోకసభ సభ్యులలో అత్యంత సంపన్నుడు, రాజకీయవేత్తగా అవతారమెత్తిన వ్యాపారవేత్త లగడపాటి రాజగోపాల్, దేశవ్యాప్తంగా నిర్మాణ కాంట్రాక్టుల ద్వారా వందల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని కొల్లగొట్టి ఇప్పుడు రాజకీయనాయకుడుగా మారిన కావూరి సాంబశివరావు, రాజకీయ నాయకుడిగా మారిన వ్యాపారవేత్త టి జి వెంకటేష్, వ్యాపారాలలో, ముఠాతగాదాలలో తలమునకలుగా ఉండి రాజకీయాలలోకి ప్రవేశించిన జె సి దివాకరరెడ్డి, గతంలో తెలుగుదేశం రాజ్యసభ సభ్యుడిగా, భారతీయ జనతాపార్టీ నాయకుడిగా, ప్రస్తుతం కాంగ్రెస్ అధికారప్రతినిధిగా ఉన్న ఎన్ తులసిరెడ్డి, కాంగ్రెస్ నాయకుడు భూమన కరుణాకరరెడ్డి, న్యాయవాదిగా, రాజీవ్, సోనియా గాంధీల ఉపన్యాసాల అనువాదకుడిగా ప్రస్తుతం పార్లమెంటు సభ్యుడైన ఉండవల్లి అరుణ్ కుమార్, ఆంధ్ర మేధావుల సంఘం నాయకుడు చలసాని శ్రీనివాస్, కాంగ్రెస్ నాయకుడు అంబటి రాంబాబు వంటివారెందరో గత నెల రోజులుగా పత్రికలలో, టెలివిజన్ ఛానెళ్లలో, చర్చలలో ఆంధ్రప్రదేశ్ చరిత్ర గురించి, తెలంగాణ గురించి, రాజ్యాంగం గురించి, హైదరాబాద్ ను తాము అభివృద్ధి చేసిన తీరు గురించి ఎన్నో వాదనలు వినిపిస్తున్నారు.
డబ్బూ అధికారమూ అబద్ధమూ అజ్ఞానమూ వక్రీకరణా కలగలసి సాగిన ఆ అభిప్రాయాలు కొందరినైనా గందరగోళపరచి ఉంటాయి. మోసపుచ్చి ఉంటాయి. నిజంగానే కోస్తాంధ్ర, రాయలసీమలలో కొంతమంది విద్యార్థులు, ప్రజలు ఆ అసత్యాల, అర్ధసత్యాల బారినపడి ఆలోచనాశక్తిని కోల్పోయి, పదిరోజులకు పైగా ఒక అన్యాయమైన ఆందోళనను నడిపారు. నిజానిజాలు తెలియని అమాయకులు చాలమంది భావోద్వేగాల కొద్దీ ఆ ఆందోళనలలో భాగం పంచుకున్నారు. ఆ అబద్ధాలను, భ్రమలను సవరించి వాస్తవాలు చెప్పడానికి చేస్తున్న ప్రయత్నమిది. ఆ అబద్ధాల అసలు వాస్తవాలను తెలుసుకునే ముందు ప్రస్తుత పరిస్థితి గురించి చిన్న ఉపోద్ఘాతం అవసరం.
ప్రారంభం
లంగాణ రాష్ట్ర సమితి నాయకుడు కె చంద్రశేఖరరావు నవంబర్ 29 నుంచి తలపెట్టిన ఆమరణ నిరాహారదీక్షను పోలీసులు భగ్నం చేయడంతో మొదలయి, నెలరోజులుగా రాష్ట్రంలోని మూడు ప్రాంతాల ప్రజలలోనూ ఆందోళనలు చెలరేగుతున్నాయి. అవసరమైన పోరాటాలతోపాటు అనవసరమైన ఉద్రేకాలు వ్యాపిస్తున్నాయి. న్యాయమైన ఆకాంక్షల వ్యక్తీకరణతోపాటు, అన్యాయమైన ప్రతివాదనలు, అవమానకరమైన నిరసనరూపాలు కూడ వెల్లువెత్తుతున్నాయి. ఈ వాతావరణంలో భావోద్వేగాల ఉరవడిలో కనీసం వందమంది ఆత్మహత్యలు చేసుకుని గాని, గుండెపోటుతో గాని మరణించారు. ప్రజాజీవనం అతలాకుతలమయింది. చాలచోట్ల ప్రభుత్వ ఆస్తులు, కొన్ని చోట్ల ప్రైవేటు ఆస్తులు కూడ ధ్వంసమయ్యాయి. మొత్తంమీద తెలుగు ప్రజల చరిత్రలోకెల్లా అత్యంత విషాదకరమైన, అవాంఛనీయమైన పరిస్థితులు నెలకొన్నాయి. అన్ని రాజకీయపార్టీలు నిట్టనిలువునా చీలిపోయాయి. పార్లమెంటులోనూ, అసెంబ్లీలోనూ ప్రజాప్రతినిధులు పార్టీలకు అతీతంగా, ప్రాంతాలను బట్టి చీలిపోయారు. రాష్ట్ర హైకోర్టులో న్యాయవాదులు ప్రాంతాల ప్రాతిపదికపై కలహానికి దిగారు. కార్యాలయాలలో ఉద్యోగుల మధ్య ప్రాంతాల వారీ విభజన వచ్చేసింది. రాష్ట్రాన్ని భౌగోళికంగా విభజించడం మాట ఎలా ఉన్నా, ప్రజలమధ్య మానసిక విభజన పెరిగిపోతున్నది. అనవసరమైన వైమనస్యం పెరిగిపోతున్నది. ప్రతి విషయంలోనూ వాస్తవాలు తెలుసుకుని, న్యాయ పక్షం వహిస్తే గాని ఈ వైమనస్యం తగ్గదు.
మూడు దశల ఆందోళనలు తెలంగాణ, కోస్తాంధ్ర, రాయలసీమలలో జరిగిన, జరుగుతున్న ఆందోళనలన్నిటినీ ఒకే ముద్దగా చూడడం సాధ్యం కాదు. ఇందులో మూడు ప్రాంతాలలో విడివిడిగా జరిగిన మూడు దశల ఆందోళనలున్నాయి. మొదటి దశ తెలంగాణలో నవంబర్ 29 నుంచి డిసెంబర్ 9 దాకా, రెండో దశ కోస్తాంధ్ర, రాయలసీమలలో డిసెంబర్ 10 నుంచి డిసెంబర్ 23 దాకా జరగగా, మూడో దశ మళ్లీ తెలంగాణలో డిసెంబర్ 23 నుంచి ఇప్పటిదాకా జరుగుతోంది.
మొదటి దశ తెలంగాణ ఉద్యమం ప్రధానంగా ఫ్రీ జోన్ ప్రకటనకు, తెలంగాణలో తెలంగాణేతరులు సాగించిన భూకబ్జాకు వ్యతిరేకంగా మొదలయి, క్రమంగా ప్రత్యేక రాష్ట్ర వాగ్దానాన్ని నెరవేర్చమని కేంద్రప్రభుత్వంపై ఒత్తిడి చేసే దిశగా సాగింది. చంద్రశేఖరరావు ఆమరణ నిరాహారదీక్ష ద్వారా శాంతియుతంగా తలపెట్టిన ఈ ఉద్యమం మీద ప్రభుత్వం దమననీతిని అవలంబించింది. తనకు తెలిసిన ఏకైక పద్ధతిలో, పోలీసులను ఉపయోగించి బలప్రయోగం చేయడంద్వారా, విరుచుకుపడింది. చంద్రశేఖరరావును మార్గమధ్యంలో నిర్బంధించి, రాజద్రోహంతో సహా అనేక నేరాలు ఆరోపించి ఖమ్మం జైలుకు తరలించారు. అప్పటికే ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని పోలీస్ క్యాంపుగా మార్చారు. దీక్ష భగ్నం చేయడాన్ని నిరసించిన ఉస్మానియా విద్యార్థులపై దారుణంగా లాఠీచార్జి జరిపి నెత్తురు కళ్లజూశారు. దానితో తెలంగాణ జిల్లాలన్నిటా విద్యార్థులలో, ప్రజలలో నిరసనజ్వాలలు చెలరేగాయి. చంద్రశేఖరరావు దీక్ష విరమించారని ప్రచారం చేసి, విద్యార్థి ఆదోళనను ఆపడానికి ప్రభుత్వం విఫల ప్రయత్నం చేసింది. కాని ఆయన దీక్ష, ఆయనకు మద్దతుగా అనేక మంది రిలే నిరాహారదీక్షలు పదిరోజులు సాగాయి. ఆ పదిరోజులూ తెలంగాణ ప్రజల ఆగ్రహ వ్యక్తీకరణ విస్తృతంగా సాగి చివరికి కేంద్ర ప్రభుత్వం దిగిరాక తప్పలేదు.
కేంద్ర హోంమంత్రి మొదటి ప్రకటన డిసెంబర్ 9 రాత్రి ఢిల్లీలో పత్రికాసమావేశంలో కేంద్ర హోంమంత్రి పి చిదంబరం 'తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమవుతోంది. ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఇందుకు తగిన తీర్మానం ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఉద్యమంలో పాల్గొన్న నేతలు, విద్యార్థులు, ఇతరులపై నమోదయిన కేసులను ఉపసంహరించవలసిందిగా ముఖ్యమంత్రికి చెప్పాం. కె. చంద్రశేఖరరావు ఆరోగ్య పరిస్థితిపై తీవ్ర ఆందోళనతో ఉన్నాం. నిరాహారదీక్షను విరమించుకోవలసిందిగా ఆయనను కోరుతున్నాం. ఆందోళనలను విరమించు కోవలసిందిగా ఇతరులను, ముఖ్యంగా విద్యార్థులను కోరుతున్నాం' అని ప్రకటించారు. ఆ మర్నాడు పార్లమెంటులో అదేమాట పునరుద్ఘాటించారు.
దానితో కోస్తాంధ్ర, రాయలసీమలలో రెండో దశ ఆందోళన మొదలయింది. కేంద్ర హోంమంత్రి ప్రకటన వెలువడిన కొద్ది గంటలలోనే, డిసెంబర్ 10 న, విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ తన లోకసభ సభ్యత్వానికి రాజీనామా చేసి, ఆ ఆందోళనకు నాంది పలికారు. మరి కొద్ది గంటలలోనే అన్ని జిల్లాలలో విద్యార్థులు, ప్రజలు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. నిరాహారదీక్షలు, రాస్తారోకోలు, బంద్ లు, ప్రత్యర్థుల దిష్టిబొమ్మల దగ్ధాలు, ప్రభుత్వ ఆస్తుల విధ్వంసం, దహనం వంటి అనేక రూపాలలో ఆ నిరసన వ్యక్తమయింది. కనీసం పది రోజులపాటు శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకూ అన్ని జిల్లాలలోనూ అస్తవ్యస్త పరిస్థితులు నెలకొన్నాయి. రాజకీయపార్టీల పరిధులను దాటి శాసనసభ్యులు రాజీనామాలు చేశారు. 2004, 2009 ఎన్నికల ప్రణాళికలలోనూ, డిసెంబర్ 7న జరిగిన అఖిలపక్ష సమావేశంలోనూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఆమోదించిన పార్టీల నాయకులు కూడ రాజీనామాలు చేసి సమైక్యాంధ్రప్రదేశ్‌కు అనుకూలంగా ఆందోళన మొదలుపెట్టారు. ప్రజాభిప్రాయం మేరకే తాము సమైక్యాంధ్ర కోరుతున్నామని అన్నారు. కొందరు నాయకులు ఆమరణ నిరాహారదీక్షకు కూడ పూనుకున్నారు.
రెండో ప్రకటన ఈ ఆందోళనను, రాజకీయ పార్టీల మధ్య ఏకాభిప్రాయం లేకపోవడాన్ని సాకుగా చూపి కేంద్రప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను పక్కనపెట్టింది. రెండు మూడు రోజులపాటు కాంగ్రెస్ అత్యున్నత స్థాయి నాయకులు చర్చలు జరిపి ఆ నిర్ణయానికి వచ్చారు. డిసెంబర్ 23 రాత్రి చేసిన ప్రకటనలో కేంద్ర హోంమంత్రి చిదంబరం '2009 డిసెంబర్ 7 న ముఖ్యమంత్రి ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశంలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుపై ఏకాభిప్రాయం వచ్చింది. ఆ మినిట్స్ పరిశీలించిన తర్వాత తెలంగాణపై 9 వ తేదీన కేంద్రం తరఫున ఒక ప్రకటన వెలువడింది. అయితే ప్రకటన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితి మారింది. అన్ని రాజకీయపార్టీలు ఈ అంశంపై విడిపోయాయి. దీనిపై రాష్ట్రంలోని సంబంధిత పార్టీలు, గ్రూపులతో విస్తృత స్థాయిలో చర్చలు జరపవలసిన అవసరం ఉంది. సంబంధిత వర్గాలన్నిటినీ ఈ ప్రక్రియలో భాగస్వాములను చేసేందుకు భారత ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఈలోపు ఆంధ్రప్రదేశ్ లో శాంతి, సామరస్య పరిస్థితులు పునరుద్ధరించవలసి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం పాలనపై, అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి సారించవలసి ఉంది. ఆంధ్రప్రదేశ్ లోని వివిధ ప్రాంతాలలోని ప్రజలు, పార్టీలు, విద్యార్థులు శాంతి, సామరస్యం, సౌభ్రాతృత్వాలతో వ్యవహరించాలని కేంద్ర ప్రభుత్వం కోరుతోంది' అని ప్రకటించారు.
ఆ ప్రకటన వెలువడడానికి కొద్ది గంటల ముందు నుంచే తెలంగాణలో, ప్రత్యేకించి విశ్వవిద్యాలయాలలో రెడ్ అలర్ట్ ప్రకటించి, వేలాది పోలీసులను, పారా మిలిటరీ బలగాలను దించారు. ఆ ప్రకటన వెలువడిన వెంటనే తెలంగాణ వ్యాప్తంగా మళ్లీ విద్యార్థులు, ప్రజలు ఆందోళన పునరుద్ధరించారు. తెలంగాణ శాసనసభ్యులు, మంత్రులు రాజీనామాలు ప్రారంభించారు. నిరాహారదీక్షలు మొదలయ్యాయి. తెలంగాణవ్యాప్తంగా బంద్ విజయవంతమయింది. అనేక చోట్ల ప్రభుత్వ ఆస్తుల విధ్వంసం మొదలయింది. ప్రకటించిన ప్రక్రియ నుంచి కేంద్ర ప్రభుత్వం వెనక్కి పోగూడదని, రాష్ట్ర విభజన నిర్ణీత కాలవ్యవధిలో జరగాలని, ఆ కాలవ్యవధిని ప్రకటించాలని కోరుతూ తెలంగాణ అంతటా ప్రజా ప్రదర్శనలు మొదలయ్యాయి. విద్యార్థులు, ఉద్యోగులు, మహిళలు, రాజకీయపార్టీలు, ప్రజాసంఘాలు ఐక్య కార్యాచరణ ప్రారంభించారు.
ఈ ఆందోళనలలో వ్యక్తమయిన పోరాటరూపాలు, నిరసనరూపాలు ఒకే రకమైనవైనప్పటికీ, రెండుచోట్లా ఆగ్రహప్రకటన ఒకేవిధంగా వ్యక్తమైనప్పటికీ రెండుచోట్ల ఆందోళనలనూ ఒకే రకంగా చూడడం సాధ్యం కాదు. రెండుచోట్ల ఆందోళనలకూ విభిన్నమైన చారిత్రక, సామాజిక, రాజకీయార్థిక కారణాలు, కోణాలు ఉన్నాయి. తెలంగాణలో జరిగిన ఆందోళన అంతకు ముందు ఆరు దశాబ్దాలుగా సాగుతున్న ఆందోళనకు కొనసాగింపు కాగా, కోస్తాంధ్ర, రాయలసీమలలో సమైక్యరాష్ట్రం కోసం సాగిన ఆందోళన కేంద్రప్రభుత్వ ప్రకటనకు ప్రతిస్పందనగా అప్పటికప్పుడు తలెత్తినది. తెలంగాణలో జరిగిన ఆందోళన ఒక విశిష్టమైన సామాజిక అస్తిత్వాన్ని నిలబెట్టుకోవాలనే కోరికతో జరిగినది కాగా, కోస్తాంధ్ర, రాయలసీమలలో జరిగిన ఆందోళన ఒక ప్రశ్నార్థకమైన అస్తిత్వాన్ని స్థిరపరచాలనే నినాదంతో జరిగినది. అన్నిటికన్న ముఖ్యంగా తెలంగాణలో జరిగిన ఆందోళన ఆరు దశాబ్దాల రాజకీయార్థిక వివక్షకూ, అన్యాయానికీ వ్యతిరేకంగా జరిగినది కాగా, సమైక్యాంధ్ర ఆందోళన ఆ సుదీర్ఘకాలపు ఆకాంక్షలను పట్టించుకోకుండా, నిరాధారమైన ప్రాతిపదికలమీద, స్వార్థపరశక్తులు ప్రచారం చేసిన అబద్ధాల మీద ఆధారపడి జరిగినది. ఈ నేపథ్యంలో సమైక్యాంధ్ర ఆందోళనకు పునాదిగా ఉండిన నినాదాల, వాదనల నిజానిజాలను పరిశీలించడం అవసరం.
అబద్ధం: తెలుగు జాతి ఐక్యత కోసం ఆంధ్రప్రదేశ్ కొనసాగాలి
వాస్తవం: తెలుగుజాతి ఒకటే కనుక ఒకే రాష్ట్రంగా ఉండాలనే అమాయక వాదన ఈ ఆందోళనలో పెద్ద ఎత్తున ప్రచారమయింది. నిజానికి జాతిభావన ఆధారంగా ప్రజలు ఏకమై దేశాలు ఏర్పరచుకున్న జాతిరాజ్యాల చరిత్ర యూరప్ లో పద్దెనిమిది, పందొమ్మిదో శతాబ్దాలలో జరిగింది గాని, భారతదేశం వంటి బహు జాతుల సమాఖ్య రాజ్యంలో జాతి ప్రాతిపదికగా రాష్ట్రాలు ఏర్పడాలనే భావనకు అంత ప్రాధాన్యత లేదు. కాని పాలకులు, అధికారులు ప్రజలకు దగ్గరిగా ఉండాలంటే, అధికారులు ఏమి మాట్లాడుతున్నారో ప్రజలకు అర్థం కావాలంటే, పాలన ప్రజల భాషలో నడవాలి. సంస్థానాలను రాజుల పాలనకు వదిలేసి, మిగిలిన ప్రాంతాలలో తన పాలన నెలకొల్పిన బ్రిటిష్ వలసవాద ప్రభుత్వం ఈ ఆదర్శాన్ని పక్కనపెట్టి, తన అవసరాలకు అనుగుణంగా దేశాన్ని ప్రావిన్స్ పేరిట, ప్రెసిడెన్సీ పేరిట ముక్కలు చేసింది. ఈ నేపథ్యంలో జాతికి ఒక పునాది అయిన భాష ప్రాతిపదికగా రాష్ట్రాలు ఏర్పడాలని జాతీయోద్యమం భావించింది. భారత జాతీయ కాంగ్రెస్ 1920లలో ప్రకటించిన ఆ అభిప్రాయంతో ఇతర రాజకీయ పక్షాలు కూడ ఏకీభవించాయి. కాని 1947 తర్వాత అధికారానికి వచ్చిన కాంగ్రెస్ రాష్ట్ర విభజనకు ఇతర ప్రాతిపదికలు కూడ అవసరమని, అందులో దేశ సమగ్రత, పాలనాసౌలభ్యం ముఖ్యమైనవని అనడం మొదలుపెట్టింది. భాష ఒక్కటే రాష్ట్రాల ఏర్పాటుకు ప్రాతిపదిక కాజాలదని రాష్ట్రాల పునర్విభజన కమిషన్ కూడ అభిప్రాయపడింది. జాతి ఐక్యత పేరిట ఒకే రాష్ట్రం గురించి వాదించేవారు ఈ చరిత్ర తెలుసుకోవాలి.
ఇంతకూ, 1956లో ఆంధ్రప్రదేశ్‌తో సహా కొన్ని భాషాప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడినప్పటికీ భాషా ప్రాతిపదిక సవ్యంగా అమలు కాలేదు. మొత్తం మీద ఒకే జాతి, ఒకే భాష మాట్లాడేవారు ఒకే రాష్ట్రంలో ఉంటే బాగుంటుందనే ఆదర్శం ఉంది గాని, ఒక జాతికి, ఒకే భాష మాట్లాడేవారికి ఒకటికన్న ఎక్కువ రాష్ట్రాలు ఉండగూడదనే ప్రమాణం ఏమీలేదు. దేశంలో ఒకే భాషకు ఒకటికన్న ఎక్కువ రాష్ట్రాలు ఉన్న ఉదాహరణలు, ఒకే రాష్ట్రంలో అనేక భాషల ప్రజలు ఉన్న ఉదాహరణలు ఉన్నాయి. హిందీ భాష మాట్లాడే ప్రజలకు తొమ్మిది రాష్ట్రాలు ఉండగా, పాండిచేరి రాష్ట్రంలో భౌగోళిక ఐక్యత కూడ లేకుండా తమిళ, తెలుగు, మలయాళ ప్రాంతాలు మూడూ ఉన్నాయి. తెలుగు భాషా ప్రజలకు ఒకేరాష్ట్రం ఉండాలనే వాదనకు 1953-56 మధ్యన ఏ కొంతయినా అర్థం, సంబద్ధత ఉన్నాయేమో గాని, 1956 తర్వాత తెలంగాణకు జరిగిన అన్యాయాల నేపథ్యంలో ఆ ఏకజాతిభావన రద్దయిపోయింది. ఇవాళ తెలుగు జాతికి ఒకే రాష్ట్రం ఉండాలని వాదించడంలో సంబద్ధత ఏమీలేదు.
అంతకు ముందు వందల సంవత్సరాలు భిన్నపాలనలలో జీవించిన తెలుగుజాతి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటుతో ఏకమయిందనీ, కనుక ఈ ఐక్యతను కాపాడుకోవాలనీ కొందరు కోరుకుంటున్నారు. ఇందులో ఆలోచించవలసిన అంశాలు రెండున్నాయి. మొదటిది తెలుగు జాతి ఐక్యత చరిత్ర, రెండవది ఆ ఐక్యతకు గత యాభై సంవత్సరాలలో ఏమి జరిగిందనే చరిత్ర.
మూడువేల ఏళ్ల చరిత్రలో మొత్తంగా తెలుగుజాతి ఒకేపాలన కింద ఉన్న కాలం చాల తక్కువ. శాతవాహనుల పాలనలో ఒకటి రెండు శతాబ్దాలు, కాకతీయుల పాలనలో రెండు శతాబ్దాలు, కుతుబ్ షాహీల పాలనలో నూట యాభై ఏళ్లు, అసఫ్ జాహీల పాలనలో యాభై ఏళ్లు మాత్రమే, అంటే మొత్తంగా మూడువేల ఏళ్లలో ఆరువందల ఏళ్లకు తక్కువగా మాత్రమే, స్థూలంగా తెలుగుజాతి ఒకే పాలన కింద ఐక్యంగా ఉంది. నిజానికి ఆ సమయాలలో కూడ, సరిగ్గా ఇవాళ్టి ఆంధ్రప్రదేశ్ అంతా ఒకే పాలనలో ఉన్నదని చెప్పడానికి వీలులేదు. కనుక తెలుగు జాతి ఐక్యత గురించి ఉన్న వాదన ఒక భావోద్వేగ ప్రకటనే తప్ప చారిత్రక వాస్తవం కాదు. కాకపోతే ఆధునిక భావజాలాల వ్యాప్తి తర్వాత, రవాణా సౌకర్యాల వ్యాప్తి తర్వాత, ముఖ్యంగా పందొమ్మిదో శతాబ్ది చివరినుంచి ఇరవయో శతాబ్ది తొలిరోజుల వరకూ, మధ్యతరగతి బుద్ధిజీవుల రచనలలో, సాహిత్య సాంస్కృతిక ఆలోచనలలో తెలుగు జాతి విడిపోయిందనే భావన, మళ్లీ కలిసి ఉంటే బాగుంటుందనే ఆకాంక్ష ప్రచారమయ్యాయి.
ఆ ఆకాంక్షే విశాలాంధ్ర భావనగా 1940 లనుంచీ ముందుకొచ్చింది. ఐతే ఈ విశాలాంధ్ర భావనను అనుమానించడానికి కూడ అప్పటికే ఆస్కారం ఉండింది. అనుమానించినవారు పాలకులలోనూ, మేధావులలోనూ కూడ ఉన్నారు. అప్పటికే బ్రిటిష్ పాలనలోని మద్రాసు ప్రెసిడెన్సీ నుంచి తెలుగుభాషా ప్రాంతాలు విడిపోయి ప్రత్యేక రాష్ట్రం కావాలనే ఆలోచనతో 1913లో ఆంధ్ర మహాసభ ఏర్పడి, ఉద్యమం సాగిస్తుండగా, కోస్తాంధ్ర రాజకీయ నాయకుల చేతిలో తమకు అన్యాయం జరగవచ్చునని, కనుక ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు జరగకముందే తమకు లిఖితపూర్వకమైన హామీలు కావాలని రాయలసీమ నాయకులు కోరారు. అలా రూపొందినదే 1937 శ్రీబాగు ఒడంబడిక. అలాగే, 1930లో నిజాంరాష్ట్రాంధ్ర మహాసభ ఏర్పాటయిన తర్వాత, దానిపేరులో ఆంధ్ర పదం ఉండడం భవిష్యత్తులో కోస్తాంధ్రతో కలవడానికేనా అనే అనుమానాలను నిజాం ప్రభుత్వం ప్రకటించింది. ఆ ఉద్దేశం తమకు లేదని నిజాంరాష్ట్రాంధ్ర మహాసభ నాయకులు మాడపాటి హనుమంతరావు స్పష్టంగా లిఖితపూర్వకంగా తెలియజేశారు.
బ్రిటిష్ పాలకులు భారతదేశాన్ని వదిలిపోయినతర్వాత ఆరు సంవత్సరాలకు మద్రాసు రాష్ట్రం నుంచి తెలుగుభాషా ప్రాంతాలలో కొన్నిటిని వేరుచేసి ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేయడం జరిగింది. నిజానికి బరంపురం, పర్లాకిమిడి, బళ్లారి, హోసూరు, ధర్మపురి వంటి ప్రాంతాలలో తెలుగు జనాభా ఎక్కువగా ఉన్నప్పటికీ, ఆ ప్రాంతాలను ఆంధ్ర రాష్ట్రంలో చేర్చలేదు. కోస్తాంధ్ర నాయకుల తెలుగు జాతి భావన ఎటువంటిదంటే, ఈ తెలుగు జాతి ప్రాంతాలను తమతో కలపకపోయినా అంగీకరించారు గాని మద్రాసు నగరం కోసం మాత్రం పట్టుబట్టారు. అది కుదరకపోయిన తర్వాత హైదరాబాదు రాష్ట్రంలోని తెలుగు ప్రాంతాలను కలిపి విశాలాంధ్ర ఏర్పాటు చేయాలనే వాదన బలపడింది. కాని హైదరాబాద్ రాష్ట్రంలోని తెలుగు ప్రజలు విడిగా ఉండడానికే ఇష్టపడ్డారు. రాష్ట్రాల పునర్విభజన కమిషన్ కూడ ఆ వాదనను అంగీకరించింది. కాని, కమిషన్ సిఫారసులకు వ్యతిరేకంగా రెండుప్రాంతాలను విలీనం చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించి ఆంధ్రప్రదేశ్ ఏర్పరచింది.
అలా 1956లో జరిగిన ఆ ఐక్యత, పెద్దమనుషుల ఒప్పందం అనే షరతులతో కూడిన ఐక్యత. ఆ ఐక్యతను జాతి ఐక్యతగా భావించి కాపాడదలచుకున్న వారు ఆ షరతులను కచ్చితంగా పాటించి ఉండవలసింది. కాని తెలంగాణకు ఇచ్చిన షరతులను కోస్తాంధ్ర, రాయలసీమ పాలకులు మొదటినుంచీ ఉల్లంఘిస్తూ వచ్చారు. ఆ తర్వాత కూడ జాతి ఐక్యతకోసం కనీసం అరడజనుసార్లు కుదిరిన ఒప్పందాలను ఉల్లంఘించిన వారు కోస్తాంధ్ర, రాయలసీమ పాలకులే. కనుక జాతి ఐక్యత అనే ఆధారాన్ని చూపే హక్కు ఆ ప్రాంత రాజకీయ నాయకులకు లేదు. కాగా విద్యార్థులకు, రైతులకు, సాధారణ ప్రజానీకానికి ఈ జాతిభావనతో, జాతిపేరిట ఐక్యతతో ఒరగబోయేది ఏమీలేదు.
అబద్ధం: రాష్ట్ర విభజన వల్ల తెలుగుజాతి బలహీనపడుతుంది.
వాస్తవం: ఒక జాతి బలమూ బలహీనతా అవి ఒకే రాష్ట్రంగా ఉన్నాయా లేవా అనే పునాది మీద ఉండవు. ఆ జాతిలోని ప్రజలందరి శాంతి, సౌభాగ్యాల మీద అధారపడి ఉంటాయి. ఒకే రాష్ట్రంగా ఉంటే తాము అన్యాయానికి, వివక్షకు, దోపిడీకి గురవుతున్నామని ఒక భాగం భావిస్తూ ఉండగా ఆ జాతి అంతర్గత ఘర్షణ వల్ల ఎప్పటికీ బలాన్ని పుంజుకోజాలదు. ఆ భయ సందేహాలను తొలగించడం అరవై సంవత్సరాలలో సాధ్యం కాలేదు. తొలగించే చిత్తశుద్ధి పాలకులకు లేదని తేలిపోయింది. అందువల్ల మరొక ఒప్పందం మీద ఎవరికీ ఆశలు లేవు. నిజంగా తెలుగు జాతి బలపడాలంటే ఈ అనుమానాలకు తావివ్వని విధంగా రెండు రాష్ట్రాలుగా విడిపోయి, రెండు రాష్ట్రాలలోనూ ఒకే భాష మాట్లాడే, ఒకే జాతికి చెందిన ప్రజలుగా ఉండవచ్చు. అవసరమైన చోటల్లా ఉమ్మడి ప్రయోజనాల కోసం పనిచేస్తూ బలాన్ని సాధించవచ్చు.
భ్రమ: పొట్టి శ్రీరాములు త్యాగం తెలుగుజాతి ఐక్యతను సాధించింది.
వాస్తవం: స్వాతంత్య్ర సమరయోధుడు పొట్టి శ్రీరాములు త్యాగ నిరతిని ప్రశంసించవలసిందే గాని, చారిత్రక వాస్తవమేమంటే, ఆయనకూ తెలుగు జాతి ఐక్యతకూ ఏమీ సంబంధంలేదు. ఆయన జీవించిన కాలంలో తెలుగు జాతి రెండు భిన్న పాలనలకింద ఉండింది. ఆయన ఎన్నడూ ఆ రెండు ప్రాంతాల ప్రజలూ ఐక్యం కావాలని కోరుకోలేదు. ఆయన కోరినదీ, ఆమరణ నిరాహారదీక్ష సాగించినదీ మద్రాసు నుంచి తెలుగు జిల్లాలను వేరు చేయమని మాత్రమే. అలా ఏర్పడిన తెలుగు జిల్లాల ప్రత్యేక రాష్ట్రానికి రాజధానిగా మద్రాసును తెలుగు వాళ్లకు ఇవ్వాలని మాత్రమే.
అబద్ధం: సమైక్యాంధ్రలో అన్ని ప్రాంతాల సమానాభివృద్ధి జరిగింది గనుక తెలంగాణలో సమస్యే లేదు.
వాస్తవం: తెలంగాణ విషయంలో ప్రాంతీయ అసమానత అనిగాని, వెనుకబాటుతనం అనిగాని, అభివృద్ధిరాహిత్యం అనిగాని, నిధులు-నీళ్ళు-నియామకాలలో వివక్ష అనిగాని, తెలంగాణకు అన్యాయం చేసిన, ద్రోహం చేసిన నాయకులు అనిగాని చర్చించడం చాల అవసరమే, పూర్తిగా సరైనదే. కాని అవి మాత్రమే చర్చిస్తే అసలు సమస్య అర్థం కాదు. ఎందుకంటే అదే మొత్త సమస్య కాదు. అది ఒక విశాల చిత్రంలో ఒక భాగాన్ని మాత్రమే స్పృశించినట్టు అవుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడినప్పటినుంచీ తెలంగాణ ప్రాంతానికి నిధుల కెటాయింపులోనూ, అభివృద్ధి పథకాలలోనూ, నీటి పారుదల పథకాలు చేపట్టి ఎక్కువభూమికి సాగునీటి సౌకర్యం అందించడంలోనూ, స్థానికులకు విద్యా, ఉద్యోగావకాశాలు కల్పించడంలోనూ, ఆర్థిక, రాజకీయ, సామాజిక, సాంస్కృతిక సంస్థలలో నిర్ణయాధికారాన్ని కల్పించడంలోనూ తెలంగాణపట్ల, తెలంగాణవాసులపట్ల అన్యాయం, వివక్ష అమలయ్యాయి.
ఆ మాటకు వస్తే అంతకుముందరి నిజాం పరిపాలనలో కూడ తెలంగాణ జిల్లాలకు అందవలసిన న్యాయమైన వాటా అందలేదు. ప్రపంచంలోనే హెన్రీ ఫోర్డ్ తర్వాత అత్యంత సంపన్నుడుగా పేరు తెచ్చుకున్న మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ జిల్లాలనుంచి జాగీర్దార్లద్వారా, దేశముఖ్ ల ద్వారా, తన సొంత రెవెన్యూ బలగాలద్వారా కోట్లాది రూపాయలు సంపాదించినప్పటికీ, అందులో కొంత భాగాన్ని హైదరాబాదు నగరాభివృద్ధికీ, హైదరాబాదులో ఆధునిక విద్యా, వైద్య, రవాణా సౌకర్యాలు కల్పించడానికీ ఉపయోగించినప్పటికీ, మిగిలిన జిల్లాలన్నీ ఏ ఆధునిక సౌకర్యానికీ నోచుకోక వెనుకబాటుతనంలోనే ఉంచబడ్డాయి, ఉండి పోయాయి. ఈ విషయం, తెలుగు భాషా ప్రాంతాలైన వరంగల్లు, కరీంనగరం, ఆదిలాబాదు, నిజామాబాదు, మెదక్ , నల్లగొండ, మహబూబ్ నగరం, అత్రాఫ్ బల్దా జిల్లాలకు మాత్రమే కాక, మరాఠీ భాషా ప్రాంతాలైన ఔరంగాబాదు, భీడ్, పర్భనీ, నాందేడ్, ఉస్మానాబాదు జిల్లాలకు, కన్నడ భాషా ప్రాంతాలైన గుల్బర్గా, రాయచూరు, బీదర్ లకు కూడ సమానంగా వర్తిస్తుంది. మహారాష్ట్రలోని పాత హైదరాబాదు సంస్థానంలో ఉండిన మరాఠ్వాడా ప్రాంతాన్నిపశ్చిమ మహారాష్ట్రతో పోల్చిచూసినా కర్ణాటకలో ఇప్పటికీ హైదరాబాదు కర్ణాటక అని పిలిచే ప్రాంతాన్ని, మైసూరు కర్ణాటక అని పిలిచే ప్రాంతంతో పోల్చిచూసినా నిజాం పాలన వారసత్వంగా మిగిల్చిన వెనుకబాటుతనం కొట్టవచ్చినట్టు కనబడుతుంది.
అయితే ఇక్కడ ప్రశ్న ఆ రాచరిక భూస్వామ్య వారసత్వానిది కాదు. ఆ వారసత్వాన్ని వదల్చడానికి, ఏకమయిన ప్రాంతాలమధ్య అసమానతలు తగ్గించడానికి ప్రజాస్వామికమని తమను తాము నిర్వచించుకున్న సమైక్య ప్రభుత్వాలు ఏ చర్యలు చేపట్టాయనేది ముఖ్యమైన ప్రశ్న. అంతకుముందే బ్రిటిష్ పాలనవల్ల ఆధునిక సౌకర్యాలు పొందిన కోస్తాంధ్ర ప్రాంతంతో పోల్చిచూసి, తెలంగాణకు ఎక్కువ సౌకర్యాలు, అవకాశాలు కల్పించవలసి ఉండగా, ఆ పని చేయలేదు సరిగదా, 1956 తర్వాత ఏ ఒక్క సంవత్సరంలోనూ మొత్తం కెటాయింపులలో జనాభా నిష్పత్తి ప్రకారం 40 శాతం వాటా గాని, విస్తీర్ణం నిష్పత్తి ప్రకారం 42 శాతం వాటా గాని, రెవెన్యూ వసూళ్ళ ప్రకారం 40 శాతం వాటాగాని కూడ అందలేదు. తెలంగాణ నుంచి వచ్చే ఆదాయపు మిగులును తెలంగాణలోనే ఖర్చుపెట్టాలని పెద్దమనుషుల ఒప్పందం నిర్దేశించగా, ఆ ఒప్పందం అమలుకాలేదు. నీటిపారుదల సౌకర్యాల కల్పనలోనూ, విద్యా, వైద్య, రవాణా సౌకర్యాల కల్పనలోనూ, స్థానికులకే ఉద్యోగాలు కల్పించడంలోనూ, తెలంగాణకు న్యాయంగా అందవలసిన వాటా అందలేదు.
ఆ అసమానత గురించి, కోల్పోయిన అభివృద్ధి అవకాశాల గురించి మాత్రమే తెలంగాణ ప్రత్యేకరాష్ట్ర ఆకాంక్ష పెల్లుబుకుతున్నదని చాలమంది అనుకుంటూ ఉంటారు. అందువల్ల అభివృద్ధి ఆశచూపితే, ప్యాకేజీలు ఇస్తే ఆ ఆకాంక్ష చల్లారిపోతుందనుకుంటారు. మొదటిసారి, 1969 లో ప్రత్యేకరాష్ట్ర ఆందోళన జరిగినప్పుడు, ఈ అంశం కొంత ఎక్కువగా బయటపడినమాట నిజమే. అప్పటికి సమైక్య ఆంధ్రప్రదేశ్ ఏర్పడి 13 సంవత్సరాలు మాత్రమే అయినందువల్ల, ఆ రాష్ట్రం ఏర్పాటు కూడ ఒక పెద్దమనుషుల ఒప్పందం వల్ల జరిగి, తెలంగాణ ప్రాంతానికి కొన్ని ప్రత్యేక రక్షణలు ఇచ్చినందువల్ల, ఆ రక్షణలను అమలు చేయాలని, అవి అమలు చేయకపోతే రాష్ట్రాన్ని విభజించాలని అప్పటి ఆందోళన జరిగింది. అప్పటి దృష్టి ప్రధానంగా పెద్దమనుషుల ఒప్పందం లోని రక్షణలమీదనే ఉండింది. అంటే ప్రత్యేకరాష్ట్ర డిమాండ్ కూడ ఉన్నప్పటికీ అసమానతే ప్రధానాంశమయింది.
ఆ అసమానతలను తీర్చేపని అప్పుడేకాదు, ఆ తర్వాత మూడున్నర దశాబ్దాలలోనూ జరగలేదు. కాని ఇప్పటికీ తెలంగాణ సమస్య అంతా అసమానత, అభివృద్ధి రాహిత్యం సమస్యేనన్నట్టు ప్రవర్తిస్తూ, మన పాలకవర్గాలు సామాజిక సమస్యల పట్ల తమకు కనీస అవగాహన కూడ లేదన్న విషయం రుజువు చేసుకుంటున్నాయి. నిజమైన సామాజికసమస్యల తీవ్రతను, విస్తృతిని తగ్గించిచూపి, మసిపూసి మారేడుకాయ చేయగలమని అనుకుంటున్నాయి.
ఇప్పటికీ తెలంగాణ వెనుకబాటుతనం, కోస్తాంధ్రతో పోలిస్తే వివక్ష, అసమానత నిజమయిన సమస్యలేగాని, వాటితో సమానంగానో, కాస్త ఎక్కువగానో ఇతర సమస్యలు కూడ ఉన్నాయి. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను విస్మరించడంలో, అణచివేయడంలో, పక్కదారిపట్టించడంలో పాలకవర్గాలు చేసిన ప్రయత్నాలవల్ల, ఆ ఆకాంక్షలను తీర్చడానికి క్షమించడానికి వీలులేనంత ఆలస్యం ఉద్దేశ్యపూరితంగానే చేసినందువల్ల ఆ సమస్యకు ఉన్న విభిన్నకోణాలు బయటికివస్తూ ఉన్నాయి. ఆ సమస్యలు మరింత జటిలంగా, సంక్లిష్టంగా మారుతూఉన్నాయి. ఇప్పుడు ఇంకా అభివృద్ధి గురించో, వెనుకబాటుతనం గురించో మాట్లాడడం, ఆ వెనుకబాటుతనాన్ని పోగొట్టే అభివృద్ధి పథకాల గురించి, ప్రత్యేక ప్యాకేజీల గురించి చర్చించడం చరిత్రను ఏ ముప్పైయేళ్ళ వెనుకకో, యాభై యేళ్ళ వెనుకకో తీసుకుపోవడమే.
అందువల్ల, ఇవాళ వెనుకబాటుతనం గురించి, అభివృద్ధి గురించి మాట్లాడడంతో సమానంగానో, ఇంకా ఎక్కువగానో చరిత్ర గురించి మాట్లాడవలసిఉంటుంది. ఏ చరిత్ర తెలంగాణను వెనుకబాటుతనానికి, అభివృద్ధి రాహిత్యానికి బలిచేసిందో వివరంగా అధ్యయనం చేయవలసిఉంటుంది. ఆ చరిత్రను 1956 కు చాల ముందుగానే ప్రారంభించవలసి ఉంటుంది. తెలుగు భాష మాట్లాడే ప్రజలు రెండు విభిన్న పాలనల కింద ఉన్నారని, వారంతా ఒకే పాలన కిందికి రావాలని ఇరవయో శతాబ్ది తొలిరోజులనుంచే ఆలోచనలున్నాయి. ఆ ఆలోచనలు అన్ని రాజకీయపక్షాలనుంచీ, మేధావులనుంచీ వ్యక్తమయ్యాయి. జాతీయ కాంగ్రెస్ 1927 లోనే భాషాప్రయుక్తరాష్ట్రాల ఏర్పాటుకు తన అనుకూలతను ప్రకటించింది. తెలంగాణతో సహా తెలుగుభాషా ప్రాంతాలన్నీ ఏకంకావాలని 1936 లో ఆంధ్రా కాంగ్రెస్ స్వరాజ్య పార్టీ ప్రతిపాదించింది. మామిడిపూడి వెంకటరంగయ్య 1937 లోనే ఇండియన్ ఎక్స్ ప్రెస్ పత్రికకు రాసిన ఒక వ్యాసంలో ఆ ప్రతిపాదన చేశారు. ఆ తర్వాత కోస్తాంధ్ర ప్రాంతంనుంచి ఎంతోమంది ఈ ఆలోచనను బలపరిచారు. కమ్యూనిస్టులుకూడ ఈ ఆలోచనకు సుముఖంగా ఉన్నారనేందుకు సూచనగా పుచ్చలపల్లి సుందరయ్య 1946లో 'విశాలాంధ్రలో ప్రజారాజ్యం' పుస్తకం రాశారు. కోస్తాంధ్ర కమ్యూనిస్టులకు ఈ విశాలాంధ్ర ఆలోచన 1937 నుంచే ఉందని సెలిగు హారిసన్ రాశారు.
అయితే మొదటి నుంచీ కూడ తెలంగాణ ప్రాంతంలో తెలుగుజాతి ఐక్యతగురించి అంతగా ఏకీభావం లేదు. ఇరవయో శతాబ్ది తొలిరోజులనుంచే, హైదరాబాదు సంస్థానంలో ఆంధ్ర భాషా నిలయాలు ఏర్పాటు చేయడం, 1921 లో ఆంధ్ర జనసంఘం ఏర్పాటు చేయడం, దాన్ని 1930 కల్లా నిజాంరాష్ట్ర ఆంద్రమహాసభగా మార్చడం చూస్తే అప్పటి తెలంగాణ ప్రజానాయకులు ఆంధ్ర ప్రాంతంతో భిన్నత్వాన్ని చూసుకోలేదనే అనిపిస్తుంది. అయితే అది రాజకీయ వివాదంగా మారి, అప్పటి ప్రభుత్వాధికారి నవాబ్ అలీ యార్ జంగు బహదూర్ 'మద్రాసు రాష్ట్రంలోని తెలుగు జిల్లాలతో తెలంగాణ జిల్లాలను విలీనం చేయడమే మీ ఆంధ్రోద్యమ లక్ష్యం లాగుందని ప్రభుత్వం దృష్టికి వచ్చింది' అని 1936లో ఆరోపిస్తే, అటువంటి ఆచరణసాధ్యంకాని ఆలోచనలు చేయడానికి తాము అంత తెలివితక్కువ వాళ్ళం కామని మాడపాటి హనుమంతరావు జవాబు రాశారు. కాని క్రమక్రమంగా హైదరాబాదు సంస్థానంలో కూడ అటు కాంగ్రెస్ లోనూ, ఇటు కమ్యూనిస్టులలోనూ విశాలాంధ్ర ఆలోచనలు బలం పుంజుకున్నాయి. ఈలోగా బ్రిటిష్ వలసపాలకులు వెళ్ళిపోయి, కాంగ్రెస్ అధికారంలోకి రావడం, హైదరాబాదుపై పోలీసుచర్య జరిగి, అది భారత యూనియన్ లో విలీనంకావడం, మద్రాసు రాష్ట్రం నుంచి తెలుగు జిల్లాలు వేరుపడి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడడం, ఆ కొత్త ఆంధ్ర రాష్ట్రం తనకంటూ ఒక రాజధానీ నగరం లేక, తాత్కాలిక రాజధానిగా కర్నూలు నుంచి పాలన సాగిస్తూ, హైదరాబాదుమీద కన్నువేయడం లాంటి పరిణామాలన్నీ జరిగిపోయాయి. అప్పుడు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల పునర్విభజన కోసం జస్టిస్ సయ్యద్ ఫజల్ అలీ అధ్యక్షతన, హృదయనాథ్ కుంజ్రూ, కె ఎం పణిక్కర్ సభ్యులుగా ఒక కమిషన్ ను నియమించింది. ఆ కమిషన్ 1954 జూన్ - జూలైలలో హైదరాబాదు వచ్చి వేరువేరు రాజకీయ పక్షాలనుంచి, ప్రజాసమూహాలనుంచి అభిప్రాయాలు సేకరించింది. హైదరాబాదు రాష్ట్రాన్ని భాషాప్రాతిపదికపై మూడుభాగాలు చేసి, తెలంగాణను ఆంధ్ర రాష్ట్రంతో కలపాలని ఒక అభిప్రాయం, హైదరాబాదు రాష్ట్రాన్ని విభజించకుండా యథాతథంగా ఉంచాలని ఒక అభిప్రాయం, హైదరాబాదు రాష్ట్రాన్ని విభజించాలనీ కాని తెలంగాణను ఆంధ్రతో కలపకుండా స్వతంత్రంగా ఉంచాలని ఒక అభిప్రాయం వచ్చాయని కమిషన్ రాసింది.
తలసరి రెవెన్యూ ఆంధ్ర రాష్ట్రంలో తొమ్మిది రూపాయల ఆరు అణాలు ఉండగా, తెలంగాణలో పదిహేడు రూపాయలుగా ఉందని, ప్రభుత్వానికి సాలీనా తెలంగాణ నుంచి ఐదుకోట్ల రూపాయల అదనపు ఆదాయం వస్తున్నదని, రాయలసీమనుంచి, కృష్ణా, గుంటూరు జిల్లాలనుంచి భూస్వాములు వచ్చి తెలంగాణలో భూములు కొనేస్తారని, పేద తెలంగాణ రైతులు ఇప్పుడు చేతికందే డబ్బులతో మురిసిపోవచ్చునని, కాని దీర్ఘకాలంలో కలిగే నష్టాన్ని గుర్తించడంలేదని, విద్యావిషయకంగా అభివృద్ధి చెందిన కోస్తాంధ్ర వాసులు తెలంగాణను ముంచెత్తి ఉద్యోగావకాశాలన్నిటినీ తన్నుకుపోవచ్చుననీ కమిషన్ తనకు అందిన అనుమానాలన్నిటినీ నమోదు చేసింది. తెలంగాణను ప్రత్యేకరాష్ట్రంగా ఉంచాలని కొందరు నాయకులు చేసిన వాదనలో ఆమోదించవలసిన అంశాలు ఉన్నాయని, కనుక తెలంగాణను ప్రత్యేకరాష్ట్రంగా ఉంచడమే మంచిదని, లేదా, 1961 ఎన్నికలలో వెలువడే ప్రజాభిప్రాయాన్ని బట్టి విలీనం గురించి నిర్ణయం తీసుకోవచ్చునని కమిషన్ 1955 సెప్టెంబర్ 30 న సమర్పించిన నివేదికలో సూచించింది.
అయినా, కోస్తాంధ్ర నాయకుల ఒత్తిడికి తలఒగ్గి, కేంద్రప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ఏర్పాటుకు పావులు కదిపింది. అప్పటివరకూ తెలంగాణ ప్రత్యేకరాష్ట్రాన్ని సమర్థిస్తుండిన హైదరాబాద్ ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు, 1955 అక్టోబర్ లో ఢిల్లీలో జరిగిన ముఖ్యమంత్రుల సమావేశంలో ఆంధ్ర - తెలంగాణ విలీనాన్ని సమర్థిస్తూ ప్రకటన చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇందుకు తెరవెనుక, కాంగ్రెస్ లోపల చాల రాజకీయాలు జరిగాయి. ఇటు తెలంగాణను ప్రత్యేకరాష్ట్రంగా ఉంచడానికి, అటు ఆంధ్ర - తెలంగాణ సమైక్యరాష్ట్రం ఏర్పరచడానికి చాల ప్రయత్నాలు జరిగాయి. క్రమక్రమంగా సమైక్యవాదులది పైచేయి కావడంతో, కనీసం తెలంగాణకు రక్షణలు కల్పించే ఒప్పందం అయినా చేసుకోవాలనే ఆలోచన వచ్చింది.
ఆ పూర్వరంగంలో 1956 ఫిబ్రవరి 20న ఢిల్లీలో హైదరాబాద్ హౌజ్ లో కోస్తాంధ్ర నుంచి బెజవాడ గోపాల రెడ్డి, అల్లరి సత్యనారాయణరాజు, నీలం సంజీవరెడ్డి, గౌతు లచ్చన్న, తెలంగాణ నుంచి బూర్గుల రామకృష్ణారావు, కొండా వెంకటరంగారెడ్డి, మర్రి చెన్నారెడ్డి, జె వి నర్సింగరావు 'పెద్దమనుషుల ఒప్పందం' మీద సంతకాలు చేశారు. ఆ ఒప్పందంలో ఉన్న 14 అంశాలలో ముఖ్యమైనవేవీ అమలులోకి రాలేదు. తెలంగాణ ప్రాంతీయ మండలి ఏర్పాటు వంటి ఒకటి రెండు అంశాలు వాస్తవరూపం ధరించినప్పటికీ, వాటికి ఏ అధికారాలూ లేకుండా చేసి, తూట్లు పొడవడానికి అన్ని ప్రయత్నాలూ జరిగాయి. అప్పటికి ఉన్న ఉద్యోగులకు ఉద్యోగభద్రత కల్పించడంలో, కొత్తఉద్యోగాలు స్థానికులకు కల్పించడంలో, తెలంగాణలోని వ్యవసాయభూముల అమ్మకాలపై పరిమితుల విషయంలో పెద్దమనుషుల ఒప్పందం విధించిన రక్షణలలో ఏ ఒక్కదాన్నీ ఖాతరు చేయలేదు. 1957 నుంచి పనిచేస్తూవచ్చిన తెలంగాణ ప్రాంతీయ మండలి తెలంగాణ అభివృద్ధికోసం చేసిన సూచనలన్నిటినీ పక్కనపెట్టారు. ఇది ఇలాఉండగా, హైదరాబాదు సంస్థానంలో 1919లో ప్రభుత్వం జారీ చేసిన ముల్కీ నిబంధనలు చెల్లవంటూ ఆంధ్రప్రాంత ఉద్యోగులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. రాష్ట్ర హైకోర్టు వారి వాదనను సమర్థిస్తూ, ముల్కీ నిబంధనలను కొట్టివేస్తూ తీర్పు ఇచ్చింది. దానిపై సుప్రీంకోర్టుకు వెళ్ళగా, సుప్రీంకోర్టు ముల్కీ నిబంధనలు చెల్లుతాయని చెపుతూ హైకోర్టు తీర్పును కొట్టివేసింది. సుప్రీంకోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ, రాష్ట్రవిభజనను కోరుతూ జై ఆంధ్ర ఉద్యమం (1972) ప్రారంభమయింది. జై ఆంధ్ర ఉద్యమాన్ని ఆపడానికనే పేరుతో కేంద్రప్రభుత్వం ఆరుసూత్రాల పథకం (1973) అనే తెలంగాణ వ్యతిరేక రాజీసూత్రాన్ని తెలంగాణనాయకులమీద రుద్దింది. అప్పటికే కాంగ్రెస్ లో కలిసిపోయిన తెలంగాణ ప్రజాసమితి నాయకులు ఈ రాజీకి అంగీకరించారు. ఆరు సూత్రాలపథకం లో పేరుకు కొన్ని తెలంగాణ ప్రయోజనాల హామీలు ఉన్నప్పటికీ అవేవీ అమలులోకి రాలేదు సరిగదా, అవన్నీ అమలుచేసినతర్వాత, అమలులోకి రావలసిన ఆరోసూత్రం వల్ల, ముల్కీ నిబంధనలు, తెలంగాణ ప్రాంతీయమండలి రద్దయిపోయాయి. ఆరుసూత్రాల పథకానికి కొనసాగింపుగా రాష్ట్రపతి ఉత్తర్వులు (1975) వచ్చి, తెలంగాణలో స్థానికుల ఉద్యోగాల రక్షణకొరకు రాజ్యాంగానికే సవరణ (అధికరణం 371 డి) చేయవలసివచ్చింది. అయినా రాష్ట్రపతి ఉత్తర్వులను అమలు చేసేందుకు ఒక ప్రభుత్వ ఉత్తర్వు ఇవ్వడానికి మరొక 11 సంవత్సరాలు వేచిచూడవలసి వచ్చింది. 1985 డిసెంబర్ లో వచ్చిన ఆ జీవో 610 ఇప్పటికి ఇరవైఐదు సంవత్సరాలు గడిచినా అమలుకు నోచుకోలేదు.
ఇలా 1955 ఫజల్ అలీ కమిషన్ సిఫార్సులు, 1956 పెద్దమనుషుల ఒప్పందం, తెలంగాణ ప్రాంతీయమండలి నివేదికలు, 1969 అఖిలపక్ష ఒప్పందం, 1969 ఎనిమిదిసూత్రాల పథకం, 1971 ఎన్నికల విజయం, 1972 సుప్రీంకోర్టు తీర్పు, 1973 ఆరుసూత్రాల పథకం, 1975 రాష్ట్రపతి ఉత్తర్వులు, 1975 రాజ్యాంగ సవరణ, 1986 జి వో నం. 610, 1998 బిజెపి కాకినాడ తీర్మానం, 2004 కాంగ్రెస్ ఎన్నికల ప్రణాళిక, 2004 కామన్ మినిమమ్ ప్రోగ్రామ్, 2004 రాష్ట్రపతి ప్రసంగం, 2004 ప్రణబ్ ముఖర్జీ కమిటీ, 2005 గిర్‌గ్లాని నివేదిక, 2008 రోశయ్య కమిటీ, 2009 తెలుగుదేశం ఎన్నికల ప్రణాళిక - ఇలా తెలంగాణ ప్రజలకు చేసిన వాగ్దానాలు ఎన్ని ఉల్లంఘనకు గురయ్యాయో లెక్కలేదు.
ఈ చరిత్రంతా గుర్తుచేయడం ఎందుకంటే, సమైక్యరాష్ట్రంలో తెలంగాణ ప్రయోజనాలు నెరవేరడం అసాధ్యమని ఇప్పటికి ఐదు దశాబ్దాలుగా అడుగడుగునా రుజువయిందని చూపడానికే. తెలంగాణకు చెందిన నాయకులు ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడుకూడ తెలంగాణ ప్రయోజనాలు నెరవేరలేదంటే సమైక్యరాష్ట్రంలో అమలయ్యే రాజకీయార్థిక పాలనావిధానాలు అందుకు అనుకూలమైనవి కాకపోవడంచేతనే. ఆ నాయకులకు తెలంగాణ పట్ల తగినంత ప్రేమ, చిత్తశుద్ధి లేకపోవడం అదనపు కారణమేతప్ప ఏకైక కారణం కాదు.
అబద్ధం: తెలంగాణ ఉద్యమం రాజకీయ నిరుద్యోగుల సృష్టే. 1969లో అదే జరిగింది. 2001లోకూడ కెసిఆర్ కు మంత్రి పదవి వచ్చి ఉంటే ఉద్యమం ఉండేది కాదు.
వాస్తవం: కోస్తాంధ్ర, రాయలసీమ మేధావులు, రాజకీయ నాయకులు చాలమంది తెలంగాణ ప్రజల ఆకాంక్షలను గుర్తించకుండా ఉండడానికి, తిప్పికొట్టడానికి ఈ వాదన లేవనెత్తుతుంటారు. ఏ మాత్రం చరిత్ర అధ్యయనం చేసినా ఇది ఎంత అబద్ధమో తెలిసిపోతుంది. నిరుద్యోగులైన రాజకీయ నాయకులు తెలంగాణ ప్రజా ఉద్యమంలో ప్రవేశించి తమ ప్రయోజనాలు నెరవేర్చుకోవాలని ప్రయత్నించి ఉండవచ్చు. కొందరు రాజకీయ నాయకులు తెలంగాణ ఆకాంక్షలకు ద్రోహం కూడ చేసి ఉండవచ్చు. కాని ఆ నాయకులు పుట్టకముందు నుంచే తెలంగాణ ప్రజల ఆకాంక్షలున్నాయి, అవి ఎప్పటికప్పుడు ఉద్యమరూపం ధరిస్తున్నాయి. 1952లో ముల్కీ ఆందోళనను ప్రారంభించినది విద్యార్థులు. ఆ తర్వాత మూడు సంవత్సరాలకు రాజకీయ నాయకులు ఆ ఆకాంక్షలను ఫజల్ అలీ కమిషన్ ముందర ప్రస్తావించారు. 1969లోనయితే నిరుద్యోగులలో, ఉద్యోగులలో, విద్యార్థులలో తెలంగాణ ఆకాంక్షలు వ్యక్తమయిన తర్వాత కొన్ని నెలలకు రాజకీయ నాయకులు మాట్లాడడం మొదలుపెట్టారు. అప్పటికే ఏర్పడిన తెలంగాణ ప్రజాసమితిలో చేరారు. ప్రస్తుత ఆందోళన కూడ 1996 లో విద్యార్థులు, సాంస్కృతిక కార్యకర్తలు ప్రారంభించగా, దానిలోకి రాజకీయ నాయకులు రావడానికి ప్రయత్నించారు. కాంగ్రెస్ కూడ ప్రవేశించాలని చూసింది. చివరికి 2001లో చంద్రశేఖరరావు తెలంగాణ రాష్ట్ర సమితిని ఏర్పాటు చేశారు. మంత్రి పదవి ఇచ్చి ఉంటే ఆయన ఉద్యమంలోకి వచ్చి ఉండేవారు కాదనే దానికి ఆధారమేమీలేకపోగా ఆ తర్వాత ఆయన స్వయంగా కేంద్రమంత్రి అయి, ఆ పార్టీ నాయకులు ఆరుగురు రాష్ట్ర మంత్రులు అయి, ఆ మంత్రి పదవులను ఆశయం కోసం వదిలిపెట్టడం జరిగింది.
అబద్ధం: తెలంగాణ రాష్ట్రం ప్రజల ఆకాంక్ష కాదు. 1969 ఉద్యమం అనబడేది అల్లరిమూకల గొడవ.
వాస్తవం: 1969లో జరిగిన తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆందోళన 1947 తర్వాత భారత రాజకీయాలలో, 1956 తర్వాత తెలుగుసీమ రాజకీయాలలో అత్యంత ఎక్కువ ప్రజాభాగస్వామ్యం ఉండిన ఉద్యమం. అతి ఎక్కువకాలం సాగిన ఉద్యమం అది. ఒక విద్యాసంవత్సరం నష్టపోయినాసరే అని విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్న చరిత్రాత్మక ఉద్యమం అది. కొన్ని నెలల పాటు ప్రభుత్వ యంత్రాంగాన్ని మొత్తం స్తంభింపజేసిన ఉద్యమం అది. తెలంగాణ జిల్లాలన్నిటా పోలీసు యంత్రాంగం, కేంద్ర రిజర్వు పోలీసు బలగాలు, సైన్యం తప్ప మరే అధికారిక వ్యవస్థ పనిచెయ్యలేకపోయిన స్థితి కల్పించిన ఉద్యమం అది. రాజ్యాంగచట్రం లోపల సాగిన ఉద్యమాలలో దానిమీద జరిగినంత అణచివేత మరే ఉద్యమం మీదా అప్పటికి జరిగిఉండలేదు. అన్నిటికన్న ముఖ్యంగా ఎంతటి నిర్బంధాన్నయినా తట్టుకుని నిలిచి కొనసాగిన ఉద్యమం అది. అధికారికంగా విరమణ జరిగినా, నాయకత్వం విద్రోహం చేసినా, రాజకీయపక్షాలు వంచించినా, మరణించని ఆకాంక్షకు స్ఫూర్తినిచ్చిన ఉద్యమం అది.
హైదరాబాదు రాష్ట్రంలో 1952లో ముల్కీ ఆందోళన జరిగినప్పటికీ, 1954-55లో రాష్ట్రాల పునర్విభజన కమిషన్ ముందర తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా ఉంచాలనే ప్రతిపాదనలు వచ్చినప్పటికీ, పెద్దమనుషుల ఒప్పందం (1956) జరిగి, ఆంధ్రప్రదేశ్ ఏర్పడినతర్వాత కనీసం పన్నెండు సంవత్సరాలపాటు ప్రత్యేక తెలంగాణ ఆలోచనలు పెద్దఎత్తున బయటపడలేదు. పెద్దమనుషుల ఒప్పందంలోని హామీల ఉల్లంఘన, ప్రభుత్వోద్యోగ నియామకాలలో తెలంగాణ వాసులకు (ముల్కీలకు) అన్యాయం, బడ్జెట్ కెటాయింపులలో తెలంగాణకు అన్యాయం, తెలంగాణలో విద్యారంగం అభివృద్ధి పట్ల అలసత్వం, పెద్దమనుషుల ఒప్పందం ప్రకారం ఏర్పడిన తెలంగాణ ప్రాంతీయమండలి సిఫారసుల పట్ల నిర్లక్ష్యం వంటి కారణాలవల్ల తెలంగాణ ప్రజలలో, ముఖ్యంగా మధ్యతరగతి విద్యావంతులలో 1960ల ప్రారంభం నుంచీ అసంతృప్తి ఉంది. అయినప్పటికీ అది 1969 దాకా ఒక ఉద్యమ రూపం ధరించలేదు. పెద్దమనుషుల ఒప్పందంలో ఇచ్చిన హామీలను రక్షణలు - సేఫ్‌గార్డ్స్ - అనేవారు. వాటిని నెరవేర్చాలనే ఆకాంక్షతో 1968 జూలై 10 న తెలంగాణ రక్షణల దినం జరపాలని ఉద్యోగ సంఘాలు ఇచ్చిన పిలుపు ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి తొలి అడుగు. ఆ సందర్భంగా హైదరాబాదులో జరిగిన ఒక సభలో అప్పటి సోషలిస్టు పార్టీకి చెందిన కార్మిక నాయకుడు బి ఎస్ మహదేవ్ సింగు తొలిసారిగా రాష్ట్ర విభజన ఆవశ్యకత గురించి, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం గురించి ప్రస్తావించినట్టు ఆధారాలున్నాయి.అప్పటి నుంచి క్రమక్రమంగా రగుల్కొన్న అసంతృప్తి నిప్పురవ్వ 1969 జనవరిలో ఖమ్మం జిల్లా పాల్వంచలో మొదలయిన నిరాహారదీక్షలతో తెలంగాణ అంతటా వ్యాపించింది. పాల్వంచలోని విద్యుత్ కేంద్రంలో ఉద్యోగ నియామకాలలో అన్యాయం జరుగుతున్నదని, దాన్ని సవరించి తెలంగాణ రక్షణలను అమలు చేయాలని జనవరి 5న ఆందోళన, నిరాహారదీక్షలు ప్రారంభమయ్యాయి. జనవరి 9 నాటికి ఆ ఆందోళన జిల్లాకేంద్రానికి విస్తరించి, అందులోకి విద్యార్థులు ప్రవేశించారు. ఖమ్మంలో బి.ఎ. విద్యార్థి రవీంద్రనాథ్ నిరాహారదీక్ష ప్రారంభించారు. ఆంధ్ర నాయకులకు వ్యతిరేకంగా ప్రదర్శనలు జరపడం, ఆంధ్ర పేరు కనబడితే నిరసన ప్రకటించడం మొదలయ్యాయి. తెలంగాణ రక్షణ సమితి అనే మొట్టమొదటి సంస్థ స్థానికంగా ఏర్పడింది. ఆ ఆందోళన కొద్ది రోజుల్లోనే నిజామాబాదుకూ, కరీంనగర్‌కూ, వరంగల్‌కూ పాకింది. 'నాన్ ముల్కీ గోబ్యాక్' అనేది ప్రధాన నినాదమయింది. జనవరి 12న హైదరాబాదులో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో అన్ని కళాశాలల విద్యార్థి సంఘాల సమావేశం జరిగి ఆందోళన ఉధృతమయింది. తెలంగాణ స్థాయి తొలి ఉద్యమ సంస్థగా జనవరి 13న తెలంగాణ విద్యార్థుల కార్యాచరణ సమితి ఏర్పడింది. ఉస్మానియా అప్పటికి తెలంగాణలో ఉన్న ఏకైక విశ్వవిద్యాలయం కావడంతో ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థుల ఆందోళన అంటే అది తెలంగాణ వ్యాపిత విద్యార్థి ఆందోళన అన్నమాటే. అదేరోజు హైదరాబాదులో తెలంగాణ పరిరక్షణల కమిటీ పేరుతో పౌర సంఘం కూడ ఏర్పడింది. పాల్వంచ నిరాహారదీక్ష ప్రారంభమయిన ఎనిమిదో రోజున, ఖమ్మం నిరాహారదీక్ష ప్రారంభమయిన నాలుగో రోజున హైదరాబాదులో అఖిల తెలంగాణ ఉద్యమ సంస్థలు ఏర్పడడమంటే, అందులోనూ రవాణా, సమాచార సంబంధాలు అంతంతమాత్రంగా ఉండిన ఆరోజుల్లో ఇంత త్వరితగతిన స్పందనలు వచ్చాయంటే ఒకవైపు ప్రజలలో ఉన్న అసంతృప్తి స్థాయి, మరొకవైపు అంతకుముందునుంచీ సాగుతూ వచ్చిన నిర్మాణకృషి అర్థమవుతాయి.
ఈలోగా పాల్వంచ విద్యుత్ కేంద్రంలో తెలంగాణ రక్షణల అమలు గురించి సాగిన వ్యాజ్యంలో, ముల్కీ నిబంధనలు స్వతంత్ర ప్రతిపత్తిగల సంస్థలకు, కార్పొరేషన్లకు వర్తించవని హైకోర్టు తీర్పునిచ్చింది. ఆ తీర్పుతో, ఇక రక్షణల గురించి కోరడం అనవసరమనీ, ప్రత్యేక రాష్ట్ర సాధన తప్ప గత్యంతరం లేదనీ అభిప్రాయం బలపడింది. అయినా రక్షణలు అమలు జరిపించుకోవడమే ముఖ్యమని, రాష్ట్ర విభజన అవసరం లేదని అభిప్రాయపడే వర్గం ఒకటి, ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తప్ప మరొక పరిష్కారం సాధ్యం కాదని భావించే వర్గం ఒకటి విద్యార్థులలోనూ, ఉద్యోగులలోనూ, రాజకీయ నాయకులలోనూ తొలినుంచీ కొనసాగుతూ వచ్చాయి. ఈ రెండు వర్గాల విద్యార్థులమధ్య హైదరాబాదులో ఘర్షణలు కూడ జరిగి పోలీసు లాఠీచార్జికి దారితీశాయి.
మొత్తం మీద తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు ఎంత వేగంగా కార్చిచ్చులా వ్యాపించాయంటే, జనవరి 19న ముఖ్యమంత్రి బ్రహ్మానందరెడ్డి అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయకతప్పలేదు. ఆ సమావేశం ఉద్యోగ నియామకాలలో తెలంగాణకు జరిగిన అన్యాయం గురించి, తెలంగాణలో ఖర్చుపెట్టకుండా మిగిలిపోయిన నిధుల గురించి చర్చించింది. నాలుగువేల ఐదువందలమంది నాన్ ముల్కీలు తెలంగాణలో ఉన్నారని, వారిని వెనక్కి పంపుతామని ప్రకటించిన ప్రభుత్వం జి.వో. 36 విడుదల చేసింది. కాని న్యాయస్థానాల వివాదాలలో చిక్కి ఆ ఉత్తర్వు అమలు కాలేదు. తెలంగాణ మిగులు నిధులు లెక్క తేల్చడానికి నిపుణుల కమిటీని నియమిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అలా నియామకమైన కె. లలిత్ కమిటీ మిగులు నిధులు రు. 34.10 కోట్లు అని తేల్చగా ఆ కమిటీ అవలంబించిన గణాంక విధానాలపై తెలంగాణ ప్రాంతీయ సంఘం అభ్యంతరం చెప్పింది. తర్వాత మిగులు నిధుల గురించి తేల్చడానికి భార్గవా కమిటీని నియమించడం జరిగింది. ఆ తర్వాత ఆ చర్చే పక్కకు పోయింది.
విద్యార్థులు ఆందోళన విరమించాలని జనవరి 19 అఖిలపక్ష సమావేశం విజ్ఞప్తి చేసినప్పటికీ ఆ సమావేశ నిర్ణయాల ఫలితం ఏమి కానుందో ముందే ఊహించినట్టుగా విద్యార్థులు ఆ విజ్ఞప్తిని పెడచెవిన పెట్టారు. విద్యార్థుల ఆందోళన యథావిధిగా జరుగుతూ పోయింది. ఆ మర్నాడే శంషాబాద్ లో విద్యార్థులమీద పోలీసులు కాల్పులు జరిపారు. తెలంగాణ ఉద్యమంలో ఇలా జనవరి 20 న ప్రారంభమైన పోలీసు కాల్పులు ఆగస్టు 7 దాకా సాగుతూనే ఉన్నాయి. జనవరి 24 న మెదక్ జిల్లా సదాశివపేటలో జరిగిన కాల్పులలో మొదటిసారి ఒక విద్యార్థి చనిపోయాడు. విజయపురి, గజ్వేల్, తాండూరు, సికింద్రాబాదు, గద్వాల, నిజామాబాద్, కరీంనగర్, మహబూబ్ నగర్, హైదరాబాద్, కొత్తగూడెం, వరంగల్ లాంటి చిన్నాపెద్దా పట్టణాలన్నిటిలో కాల్పులు జరిగాయి. ఎన్నో చోట్ల లాఠీచార్జిలూ, 144 సెక్షన్ విధింపు, కర్ఫ్యూలు, వేలాది మంది అరెస్టులూ జరిగాయి.
ప్రభుత్వ గణాంకాల ప్రకారమే ఆ ఆరు నెలలలో 96 సార్లు కాల్పులు జరిగాయంటే, ప్రతి రెండో రోజూ పోలీసుకాల్పులు జరిగి తెలంగాణ అగ్నిగుండంలా ఉండిందన్నమాట. ఈ అగ్నిగుండంలో విద్యార్థులు అగ్రభాగాన నిలిచి ఎక్కడికక్కడ రోడ్లమీద అవరోధాలు ఏర్పరిచారు. ప్రభుత్వ ఆస్తులపై తమ కసి తీర్చుకున్నారు. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేశారు. తగులబెట్టారు. ఆసిడ్, పెట్రోలు, ఇతర మండేపదార్థాలతో మాల్టవ్ కాక్ టెయిల్స్ తయారుచేసి ప్రభుత్వ ఆస్తులమీదికి, పోలీసు, పారామిలిటరీ బలగాలమీదికి విసరడం అలవాటు చేసుకున్నారు. పోలీసులు బాష్పవాయుప్రయోగం చేస్తారని ముందుగానే ఊహించి ఆ వాయువు ప్రభావం నుంచి తప్పించుకునేందుకు ఉల్లిగడ్డలు, నీళ్లు వెంట తీసుకుపోవడం, బాష్పవాయు గోళాలను వెనక్కి పోలీసులమీదికి విసిరివేయడం వంటి సృజనాత్మక పోరాటరూపాలను చేపట్టారు. కోస్తాంధ్ర వ్యాపారుల ఆస్తులను ధ్వంసం చేశారు. లూటీ చేశారు. ఈ ఆందోళనా రూపాలతో పాటు ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర అవసరాన్ని ప్రచారం చేసేందుకు ప్రతిరోజూ సభలు, సమావేశాలు, ధర్నాలు, ఊరేగింపులు జరపడం, విస్తృతంగా గోడలమీద నినాదాలు రాయడం, కరపత్రాలు అచ్చువేసి పంచడం, కొత్త కొత్త నినాదాలను రూపొందించడం వంటి పనులెన్నో చేశారు. జనవరి నుంచే ప్రారంభమైన తరగతుల బహిష్కరణ, పాఠశాలలను, కళాశాలలను మూసివేయడం మార్చి, ఏప్రిల్ లనాటికి ఉధృతమై పరీక్షలు జరగడం కష్టమయింది. చాల మంది విద్యార్థులు ఆ విద్యాసంవత్సరాన్ని నష్టపోయారు. వేసవి సెలవుల తర్వాత కూడ నవంబర్ దాకా ఏదో ఒక స్థాయిలో ఉద్యమం నడుస్తూ ఉండింది గనుక తర్వాతి విద్యాసంవత్సరం కూడ సక్రమంగా నడవలేదు. ఈ రకంగా విద్యార్థులు ప్రధానంగా పాల్గొన్న, రూపొందించిన ఈ ఆందోళనలలోకి ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది, ప్రభుత్వోద్యోగులు, ముఖ్యంగా ఎన్ జి వోలు, కొన్ని చోట్ల కార్మికులు కూడ ప్రవేశించి వారి వారి రంగాలలోకి ఆందోళనను విస్తరించారు.
ఈలోగా విద్యార్థుల ఆందోళనకు సంఘీభావం తెలపడానికి, ఒక విస్తృత వేదికగా పనిచేయడానికి ఫిబ్రవరి 28న తెలంగాణ ప్రజా సమితి ఏర్పాటయింది. రాజకీయాలతో అప్పటికి ప్రత్యక్ష సంబంధంలేని యువకులు, మేధావులు, ఉపాధ్యాయులు, న్యాయవాదులు వంటి వారే తెలంగాణ ప్రజా సమితిని నెలకొల్పడంతో సమాంతరంగా అన్ని రాజకీయ పక్షాలలోనూ కదలిక ప్రారంభమయింది. కొండా వెంకటరంగారెడ్డి, కొండా లక్ష్మణ్ బాపూజీ వంటి సీనియర్ తెలంగాణ నేతల దగ్గరినుంచి స్థానిక నేతలవరకూ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రమే ఏకైక పరిష్కారమని ప్రకటించడం మొదలుపెట్టారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఒక రాజకీయ డిమాండ్ రూపాన్ని సంతరించుకోవడం మొదలయింది. ఈ పరిస్థితిని గమనించిన కేంద్రప్రభుత్వం ఏప్రిల్‌లో తెలంగాణ సమస్యల పరిష్కారం కొరకు అష్టసూత్ర పథకాన్ని ప్రకటించింది. దానితో తెలంగాణ ఉద్యమకారులు సంతృప్తి చెందలేదు. ఏప్రిల్ 21 న మర్రి చెన్నారెడ్డి తెలంగాణ ప్రజా సమితిలో చేరి దాని నాయకుడైపోయారు. చెన్నారెడ్డి ప్రవేశం తర్వాత కొన్నిరోజులపాటు తెలంగాణ ఉద్యమం విజృంభించినప్పటికీ, రాజకీయ చదరంగపుటెత్తులకు రంగస్థలంగా మారిపోయి, తెలంగాణ రాష్ట్ర సాధన లక్ష్యం మరుగున పడడం మొదలయింది. విద్యార్థులు, ఉద్యోగులు ఇంకా పోరాట చైతన్యాన్ని ప్రదర్శిస్తున్నప్పటికీ, తెలంగాణ జిల్లాలన్నిటిలోనూ ఆందోళనలు సాగుతూనే ఉన్నప్పటికీ, తాను నాయకుడైన తర్వాత కూడ పోలీసు కాల్పులు, అరెస్టులు వంటి నిర్బంధకాండ సాగుతున్నప్పటికీ, ఆ నిర్బంధాన్ని అధిగమించి పోరాటాన్ని ముందుకు తీసుకుపోవాలనే ఆకాంక్షను ఉద్యమకారులు చూపుతున్నప్పటికీ, తెలంగాణ ప్రజా సమితి నాయకుడిగా చెన్నారెడ్డి ప్రధానమంత్రి ఇందిరాగాంధీతో, కాంగ్రెస్ అధినాయకత్వంతో చర్చలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు.
చివరికి ఒకసారి ఢిల్లీకి వెళ్ళివచ్చిన తర్వాత నవంబర్ 27న పోరాటాన్ని వాయిదావేస్తున్నామని చెన్నారెడ్డి ప్రకటించారు. ఈ ప్రకటనకు ప్రతిగా చెన్నారెడ్డిని తెలంగాణ ప్రజాసమితి అధ్యక్షస్థానం నుంచి తొలగిస్తున్నట్టు కార్యదర్శి టి ఎన్ సదాలక్ష్మి డిసెంబర్ 6న ప్రకటించారు. తెలంగాణ ఉద్యమం ఆగదని, కేవలం ప్రధానికి ఒక సంవత్సరం గడువు మాత్రం ఇచ్చివచ్చానని చెన్నారెడ్డి జవాబిచ్చారు. ఈవిధంగా రాజకీయ భిన్నాభిప్రాయాలు, ఎత్తుగడలు ఎట్లా ఉన్నా, డిసెంబర్ 26న చెన్నారెడ్డి తెలంగాణ ప్రజాసమితి అధ్యక్షునిగా మళ్లీ ఎన్నికయ్యారు.
ఆ తర్వాత విస్తృత ప్రజాభాగస్వామ్యంతో జరిగే ఆందోళనల స్థానాన్ని ఎన్నికల రాజకీయాలు ఆక్రమించడం మొదలయింది. 1970 జూన్ లో జరిగిన ఖైరతాబాద్ ఉపఎన్నికలలో తెలంగాణ ప్రజా సమితి అభ్యర్థి గెలిచారు. ఆ తర్వాత జరిగిన సిద్ధిపేట ఉపఎన్నికలలోనూ తెలంగాణ ప్రజా సమితి ఘన విజయం సాధించింది. అప్పటివరకూ వీథి పోరాటాలలో తమ ఆకాంక్షను వ్యక్తం చేసి ప్రభుత్వాన్ని స్తంభింపజేసిన తెలంగాణ ప్రజలను బాలట్ 'పోరాటానికి' పరిమితం చేయడానికి తెలంగాణ ప్రజా సమితి ప్రయత్నాలు ప్రారంభించింది. ఆ తర్వాత 1971 మార్చ్ లో లోక్ సభకు జరిగిన మధ్యంతర ఎన్నికలలో తెలంగాణ ప్రాంతంలోని 14 పార్లమెంటరీ స్థానాలలో 10 స్థానాలను తెలంగాణ ప్రజా సమితి కైవసం చేసుకున్నది. అలా ప్రజా మద్దతును చూపుకున్న తెలంగాణ ప్రజా సమితి 1971 సెప్టెంబర్ లో తనను తాను రద్దు చేసుకుని కాంగ్రెస్ లో విలీనం కావడంతో తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో ఒక శకం ముగిసింది.
భ్రమ: తెలంగాణ ప్రజలలో కోరిక ఉంటే ఎన్నికలలో వ్యక్తమయ్యేదే.
నిజం: మన సమాజంలో ఎన్నికలు పూర్తిగా ప్రజాభిప్రాయానికి సూచికలేమీ కాదు. ప్రజాభిప్రాయంతో పాటు, కులం, మతం, ప్రాంతం, డబ్బు, మద్యం, ఆకర్షణలు, భ్రమలు, బెదిరింపులు, బలప్రయోగాలు వంటి ఎన్నెన్నో కారణాలు కలిసి ఎన్నికల ఫలితాలను నిర్ణయిస్తాయి. పైగా ఎన్నికల ఫలితాలు సాధారణంగా అంకెల గారడీగా ముగుస్తాయి. కనుక ఎన్నికల ఆధారంగా ప్రజాసమస్యలను అంచనాకట్టడానికి చాల పరిమితులున్నాయి.
భ్రమ: హైదరాబాద్ అభివృద్ధి కోస్తాంధ్ర, రాయలసీమ వల్లనే జరిగింది.
వాస్తవం: కోస్తాంధ్ర, రాయలసీమలలో ఆందోళనకు హైదరాబాదు తమకు దూరమయి పోతుందేమోననే అనుమానం ఒక కారణం. నాయకులలో ఎక్కువమంది కాంట్రాక్టర్లు, పారిశ్రామికవేత్తలు, వ్యాపారులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు గనుక వారిలో హైదరాబాద్ లోని తమ ఆస్తులకు, వ్యాపారాలకు ఏమి జరుగుతుందోననే ఆందోళన ఉంది. మామూలు ప్రజలకేమో, విద్యా, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉండే ఒక మహానగరం తమకు దూరమైపోతుందేమోననీ, అటువంటి మహానగరాన్ని తాము నిర్మించుకోవడానికి ఒక తరమయినా పడుతుందనీ అనుమానాలు ఉన్నాయి. ప్రజలలోని ఈ అనుమానాల్ని ఆసరా చేసుకుని, తమ ప్రయోజనాలను పరిరక్షించుకోవడం కొరకు రాజకీయ నాయకులు అనేక అబద్ధాలు, భ్రమలు ప్రచారం చేస్తున్నారు. తమవల్లనే హైదరాబాదు అభివృద్ధి అయిందని అంటున్నారు. తాము రాకముందు హైదరాబాదులో తొండలు గుడ్లు పెట్టేవని ఒక నాయకుడు అనగా, తాము హైదరాబాదుకు చేసిన సేవకు తమకు లక్షకోట్ల రూపాయల పరిహారం చెల్లించాలని మరొక నేత అన్నారు. హైదరాబాద్ ను ఉమ్మడి రాజధాని చేయాలని కొందరు, కేంద్రపాలిత ప్రాంతం చేయాలని కొందరు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు.
హైదరాబాదు చరిత్రను పరిశీలిస్తే ఈ అబద్ధాలన్నీ తేటతెల్లమవుతాయి. గోల్కొండ రాజధానిగా కుతుబ్‌షాహి పాలన 1512లో మొదలయ్యే నాటికి ఇవాళ్టి కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాలు విజయనగర సామ్రాజ్యంలో ఉన్నాయి. 1565లో విజయనగర సామ్రాజ్యం కూలిపోయినతర్వాత మాత్రమే ఆ ప్రాంతాలు గోల్కొండ ఏలుబడిలోకి వచ్చాయి. మరొక ముప్పై ఏళ్ల తర్వాత 1591లో హైదరాబాద్ నగర నిర్మాణం ప్రారంభమయింది. కాని ఔరంగజేబు దండయాత్ర వల్ల, కుతుబ్ షాహి పాలన అంతమయి, సంధి దశ ఏర్పడడం వల్ల అసలు రాజధానే గోల్కొండ నుంచి ఔరంగాబాదుకు తరలిపోయింది. మళ్లీ అసఫ్‌జాహీ పాలకులలో రెండో నిజాం, నిజాం అలీఖాన్ 1763లో రాజధానిని హైదరాబాదుకు మార్చాడు. ఆ తర్వాత మూడు సంవత్సరాలకే (1766) కోస్తాంధ్రలో కొంత భాగం, తర్వాత ఇరవై సంవత్సరాలకు (1787) కోస్తాంధ్రలో మిగిలిన భాగం, ఆ తర్వాత ముప్పై సంవత్సారాలలో (1799) రాయలసీమ మొత్తం నిజాం సంస్థానం నుంచి బ్రిటిష్ వారికి దఖలయిపోయాయి. ఆ తర్వాత కోస్తాంధ్ర, రాయలసీమలు హైదరాబాదు రాజధానిగా ఉన్న ఆంధ్రప్రదేశ్ లోకి వచ్చినది 1956 నవంబర్ 1న మాత్రమే.అంటే, 1591 నుంచి 1687 వరకు హైదరాబాద్ రాజధాని కాదు. రాజధాని శివార్లలోని ఒక పట్టణం మాత్రమే. ఆనాడు కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాలు గోల్కొండ రాజ్యంలో భాగమే అయినా ఆ ప్రాంతాల నుంచి వచ్చిన ఆదాయం గాని, దాన్ని హైదరాబాదుకు ఖర్చుపెట్టిన దాఖలాలు లేవు. ఆ తర్వాత ఏడు దశాబ్దాల పాటు ఈ ప్రాంతాలన్నీ ఔరంగాబాదు రాజధాని కిందికి వెళ్లాయి గనుక అప్పుడు కూడ హైదరాబాదు అభివృద్ధి ఏమీ జరగలేదు. ఇక 1763లో హైదరాబాదు రాజధాని అయినప్పటికీ ఇవాళ్టి కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాలు, ఆ రాజధాని పాలనలో ఎక్కువకాలం లేవు. నిజానికి హైదరాబాదు ఆధునిక నగరంగా ఎదిగినది 1850ల తర్వాత ప్రధానిగా సాలార్ జంగు అమలు చేసిన సంస్కరణల కాలంలో. అప్పటికి కోస్తాంధ్ర, రాయలసీమలు హైదరాబాదు రాజ్యంలో భాగం కావు గనుక వాటికి ఆ అభివృద్ధిలో ఏ భాగమూ లేదు. ఇక 1956 నవంబర్ 1 నుంచి కోస్తాంధ్ర, రాయలసీమ కలిసిన ప్రాంతానికి హైదరాబాదు రాజధానిగా ఉంది గనుక ఈ యాభై మూడు సంవత్సరాలలో హైదరాబాదులో ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు ఏమిటి, వాటికి ఏ ప్రాంతం వాటా ఎంత అనే విషయం లెక్కలు వేసుకోవచ్చు. మొత్తంగా మూడు ప్రాంతాల నుంచి వచ్చిన ఆదాయం ఎంత, ఆయా ప్రాంతాలలో జరిగిన ప్రభుత్వ వ్యయం ఎంత, ఒప్పందాలు సక్రమంగా అమలయి ఉంటే తెలంగాణలో ఎంత సంపద సృష్టించబడి ఉండేది, ఉల్లంఘనల వల్ల ఎంత నష్టమయిపోయింది అని కూడ లెక్కలు తేల్చవచ్చు.
ఇక ప్రైవేటు పెట్టుబడుల విషయానికి వస్తే నాలుగు శతాబ్దాల హైదరాబాదు చరిత్రలో ఇరానియన్లు, కాయస్తులు, సింధీలు, మార్వాడీలు, గుజరాతీలు, తమిళులు మొదలయిన అనేక జాతులు ఇక్కడికి వచ్చి తమ పెట్టుబడులు పెట్టారు. నగరానికి తాము ఇవ్వగలిగింది ఇచ్చారు. ఏ ఒక్కరూ ఈ నగరాన్ని తామే అభివృద్ధి చేశామని గాని, తమ వాటా తమకుఇమ్మని గాని అడగలేదు. అసలు ప్రపంచచరిత్రలోనే అన్ని నగరాలూ అనేక జాతుల, ప్రజాసమూహాల కృషితో నిర్మాణమయ్యాయి గాని ఈ నగరం అభివృద్ధి మావల్లనే అయింది, కాబట్టి వదిలి వెళ్లాలంటే నష్టపరిహారం ఇవ్వండి అని ఎవరూ అడగలేదు. ఏ నగరమయినా భౌగోళికంగా ఏ ప్రాంతంలో ఉంటుందో ఆ ప్రాంతానికే చారిత్రకంగా, సాంస్కృతికంగా చెంది ఉంటుంది. తెలుగు వాళ్లు ఎంత అడిగినా మద్రాసు విషయంలో అదే జరిగింది. గుజరాతీలు ఎంత అడిగినా బొంబాయి విషయంలో అదే జరిగింది.
అంతేకాదు, నిజాం రాజవంశం, ముఖ్యంగా 1913 నుంచి 1948 దాకా పాలించిన ఏడవ నిజాం నిరంకుశ భూస్వామ్యం పునాదిగా పాలించారు గనుక హైదరాబాద్ రాజ్య ప్రజల గోళ్లూడగొట్టి పన్నులు వసూలు చేసి హైదరాబాదును అభివృద్ధి చేశారు. అంటే హైదరాబాదు నిండా ఉన్నది హైదరాబాదు రాజ్య ప్రజల నెత్తురూ చెమటా. అందులో ఐదు మరాఠ్వాడా జిల్లాల, మూడు కన్నడ జిల్లాల ప్రజల భాగస్వామ్యమయినా ఉంది గాని కోస్తాంధ్ర, రాయలసీమ ప్రజల పాత్ర లేదు. అలాగే, ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ కు సర్ఫ్ ఎ ఖాస్ అనే పేరు మీద తనకు తానే సొంత భూమి రాసుకున్నాడు. రాజ్యంలోని ఐదు కోట్ల ఎకరాలలో యాభైలక్షల ఎకరాల భూమి ఇలా ఆయన సొంత ఆస్తిగా ఉండేది. అందులో ఇవాళ హైదరాబాదులో చేరిన ఆరు వందల గ్రామాల భూములు ఉన్నాయి. ఆ లక్షలాది ఎకరాల భూమి నిజానికి హైదరాబాద్ రాజ్య ప్రజల శ్రమ ఫలితం. దాన్ని లీజులకు ఇచ్చి, అమ్మి, అన్యాక్రాంతం చేసి, రియల్ ఎస్టేట్ గా మార్చి ఆ డబ్బుతో హైదరాబాద్ ను 'అభివృద్ధి' చేసి, మేమే అభివృద్ధి చేశామని అనడం అనైతికం.
విభజన తర్వాత హైదరాబాదు కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంత సాధారణ ప్రజలకు రాజధానిగా ఉండకపోవచ్చుగాని, దేశంలోని అన్ని నగరాలలో వారికి ఎంత అవకాశం ఉన్నదో అంత అవకాశం ఉంటుంది. నిజానికి 1953లో రాజధాని మద్రాసును వదులుకున్నప్పటికీ తెలుగు సినిమారంగం ఆ తర్వాత ముప్పై సంవత్సరాలు అక్కడే ఉంది. లక్షలాది కోస్తాంధ్ర, రాయలసీమ ప్రజలు అక్కడే ఉన్నారు. బొంబాయి విషయంలో మహారాష్ట్రులకు, గుజరాతీలకు ఘర్షణలు జరిగినప్పటికీ, ఇవాళ్టికీ ఆ నగర జనాభాలో 20 శాతం గుజరాతీలే. హైదరాబాదులో వేలాది ఎకరాల భూములు, కోట్లాది రూపాయల ఆస్తులు సంపాదించినవారికే ఎటువంటి ప్రమాదమూ లేనప్పుడు, సాధారణ మధ్యతరగతి, పేద ప్రజానీకం ఆ విషయంలో ఆందోళన చెందవలసిన అవసరమే లేదు.
భ్రమ: చిదంబరం హడావుడి ప్రకటన వల్లనే ప్రస్తుత సంక్షోభం తలెత్తింది. కోస్తాంధ్ర, రాయలసీమ ప్రజల మనోభావాల మేరకే రాజకీయ పార్టీల స్పందన ఉంది.
నిజం: పైన వివరించిన అరవై సంవత్సరాల చరిత్ర చూస్తే చిదంబరం ప్రకటన హడావిడి ప్రకటన అని ఎవరూ అనజాలరు. అలాగే రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రానికి తాము అనుకూలమేనని 2004 ఎన్నికల సమయంలోనో, 2009 ఎన్నికల సమయంలోనో ప్రకటించాయి. రాష్ట్రంలో ఒక్క భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) తప్ప తెలంగాణ రాష్ట్రానికి వ్యతిరేకమయిన పార్టీ ఒక్కటి కూడ లేదు. ఆ అన్ని పార్టీలూ ఇంత కాలంగా ప్రజలతోనే ఉన్నాయి. ఆ పార్టీలు ప్రకటించిన అభిప్రాయం ప్రజలకు నచ్చకపోయి ఉంటే ఎప్పుడో ఒకప్పుడు ఆ సూచనలు వచ్చి ఉండేవి. అటువంటపుడు చిదంబరం ప్రకటన హడావిడి ప్రకటన అనడం, ప్రజలు ఆ ప్రకటనను వ్యతిరేకించినందువల్లనే తాము ఆందోళన చేస్తున్నామనడం రాజకీయ దివాళాకోరుతనమే.
అబద్ధం: ఆంధ్రప్రదేశ్ శాసనసభ తీర్మానం చేయకపోతే తెలంగాణ ఇవ్వలేం.
వాస్తవం: ఈ అబద్ధం చిదంబరం ప్రకటనతో మొదలయింది. నిజానికి రాజ్యాంగం ప్రకారం రాష్ట్ర శాసనసభ తీర్మానం అవసరం లేదు. 1960లో బాబూలాల్ పరాటె వర్సస్ స్టేట్ ఆఫ్ బొంబాయి కేసులో ఇచ్చిన తీర్పులో సుప్రీంకోర్టు చాల స్పష్టంగా శాసనసభ తీర్మానం అవసరం లేదని చెప్పింది. అసలు అటువంటి తీర్మానం సాధ్యం కాదనేది స్పష్టమే. అయినా రాజకీయ నాయకులు రాజ్యాంగ బద్ధమైన వాస్తవాన్ని ప్రజలకు చెప్పకుండా అబద్ధాలను ప్రచారం చేస్తూ రెచ్చగొడుతున్నారు.
అబద్ధం: చిన్నరాష్ట్రంగా తెలంగాణ మనుగడ కష్టమవుతుంది.
వాస్తవం: ఈ అబద్ధానికి ఎన్నో స్థాయిలో జవాబులు చెప్పవచ్చు. ఇవాళ దేశంలో తెలంగాణ కన్న చిన్న రాష్ట్రాల పద్దెనిమిది ఉన్నాయి. అవన్నీ మనుగడ సాగించడం మాత్రమే కాదు, వాటిలో చాలా రాష్ట్రాలు అభివృద్ధి సూచికలలో ఆంధ్రప్రదేశ్ కన్న పైననే ఉన్నాయి. అసలు ఒక రాష్ట్రం మనుగడ సాగించగలదా లేదా అనే ప్రశ్నకు దాని విస్తీర్ణం ప్రమాణం కాదు. దాని వనరులు ఏమిటి, ఆ వనరుల వినియోగం సక్రమంగా సాగుతుందా, దాని మనుగడ ఆ ప్రజల అభీష్టంగా ఉందా లేదా అనేవే ప్రమాణాలు అవుతాయి. ఆ మూడు ప్రశ్నలకు కూడ తెలంగాణ సానుకూల సమాధానం చెపుతుంది.
భ్రమ: తెలంగాణ ఏర్పడితే కోస్తాంధ్ర, రాయలసీమ విద్యార్థులకు అన్యాయం జరుగుతుంది.
నిజం: విద్యార్థులను ఆందోళన పరచినవి రాష్ట్రవిభజనతో ఉన్నత విద్యావకాశాలు కోల్పోతామనే భయాలు. నిజానికి ఇప్పటికే నెలకొని ఉన్న విశ్వవిద్యాలయాల ప్రవేశ అరతల ప్రకారం ఒక ప్రాంత విద్యార్థులకు, మరొక ప్రాంతంలో స్థానికేతరులుగా పదిహేనుశాతం సీట్లకు మాత్రమే అవకాశం ఉంది. విశ్వవిద్యాలయ విద్యకయితే రాష్ట్రవిభజన జరిగినా ఇదే కొనసాగుతుంది. కనుక విద్యార్థులు నష్టపోయేది పెద్దగా ఉండదు. ఇక విశ్వవిద్యాలయ విద్య కాక, ఇంకా ఉన్నతవిద్యా సంస్థలు, ఎన్ ఐ టి, ట్రిపుల్ ఐటి, వంటి చోట్ల ఇప్పటికే రాష్ట్రాల మధ్యనే పోటీ ఉంది. కొత్తగా రాష్ట్రాలు ఏర్పడితే, నిజానికి రెండు రాష్ట్రాల తెలుగు విద్యార్థులకు ఎక్కువ సీట్లు వచ్చే అవకాశమే ఉంటుంది. ఐ ఎస్ బి లాంటి ఉన్నత విద్యాసంస్థలలో స్థానికులకు రిజర్వేషన్ లేనేలేదు. రాష్ట్రవిభజనవల్ల హైదరాబాదులోని ఉన్నత విద్యాసంస్థలలో తమ వాటాకు గండిపడుతుందనే భయాన్ని వ్యక్తం చేస్తున్న విద్యార్థులు నిజానికి అడగవలసింది సమైక్య రాష్ట్రం కాదు. రాష్ట్రవిభజన తర్వాత, హైదరాబాదులో ఉన్న ఉన్నత విద్యాసంస్థలన్నిటికీ, సమానమైన సంస్థలను ఆంధ్ర-రాయలసీమలలో కూడ నెలకొల్పాలని డిమాండ్ చేయడం న్యాయబద్ధంగా ఉంటుంది.
భ్రమ: తెలంగాణ ఏర్పడితే, కోస్తాంధ్ర, రాయలసీమ ఉద్యోగులకు, నిరుద్యోగులకు అన్యాయం జరుగుతుంది.
నజం: ఉన్నత విద్యావకాశాలు కోల్పోతామనే అనుమానంతో పాటు ఉద్యోగాలు కోల్పోతామనే అనుమానం కూడ తెలంగాణేతర ప్రాంతాలలో ఆందోళనకు కారణమయింది. నిజానికి ఇది కూడ నిరాధారమైన అనుమానమే. ఉమ్మడి రాష్ట్రంలో విస్తీర్ణం, జనాభా దామాషాలను బట్టి కచ్చితంగా ఉద్యోగ కల్పన జరిగిఉంటే ఏ మార్పులు జరిగినా ఎవరూ భయపడనక్కరలేదు. గతంలో జరిగిన రాష్ట్ర విభజనలలో అప్పటికి ఉన్న ప్రభుత్వోద్యోగాలలో ప్రాంతాల వాటాను బట్టి, ఉద్యోగుల ఎంపికనుబట్టి, ఆయా రాష్ట్రాలకు వారిని పంపించడం అనే ప్రక్రియ జరిగింది. కనుక ఇప్పటికే ఉద్యోగస్తులయిన వారు తమ ప్రమేయం లేకుండా, ఇష్టానికి వ్యతిరేకంగా ఎక్కడికో తరలిస్తారని భయపడనవసరం లేదు. ఇక రానున్న ఉద్యోగాలలో తమవాటా దొరకదనే నిరుద్యోగుల భయానికి కూడ అర్థం లేదు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో కొత్త ఉద్యోగ కల్పన ఎంత జరుగుతుందో, మిగిలిన రాష్ట్రంలో కూడ అంతగానూ జరగవచ్చు, అంతకన్న ఎక్కువయినా జరగవచ్చు. అసలు ప్రపంచీకరణ క్రమం మొదలయిన తర్వాత ప్రభుత్వ రంగంలో ఉద్యోగ కల్పనే పెద్ద ఎత్తున జరగడం లేదు. ప్రభుత్వోద్యోగాలు మాత్రం ఏరాష్ట్ర ప్రజలకు ఆ రాష్ట్రంలోనే వస్తాయి. కాని పెద్దఎత్తున ఉద్యోగకల్పన జరుగుతున్న ప్రైవేటు రంగంలో ఒక రాష్ట్రం వారు మరొక రాష్ట్రంలో ఉద్యోగం సంపాదించుకోగూడదని ఏమీ లేదు.
భ్రమ: తెలంగాణ ఏర్పడితే నదుల మీద గోడలు కట్టి ఒక్క చుక్క నీరు కూడ కిందికి రానివ్వరు.
నిజం: అలా ఒకే జాతిభావన అనే శుష్కమైన సెంటిమెంటు, విద్యా, ఉద్యోగావకాశాల కొరత అనే నిరాధారమైన భయాలు విద్యావంతులను ఆందోళన పరచగా, రైతులను, సాధారణ ప్రజానీకాన్ని నదీజలాలలో తమ వాటా తమకు దక్కదేమోననే అనుమానాలు ఆందోళన పరచాయి. తెలంగాణ రాష్త్రం ఏర్పడితే కృష్ణకు, గోదావరికి అడ్డంగా గోడలు కట్టి కిందికి ఒక్కచుక్క నీరు కూడ వదలరనే మాటను రాజకీయనాయకులు ప్రచారం చేశారు. ఇది పచ్చి అబద్ధం. ఎగువరాష్ట్రమైన తెలంగాణ దిగువ రాష్ట్రమైన కోస్తాంధ్రకు నదీజలాలను వదలకతప్పదు. వరదలు వచ్చి, పైన జలాశయాలు పూర్తి స్థాయి నీటి మట్టం నిండినాకనయినా వదలక తప్పదు. జాతీయ జలవనరుల పంపిణీ ట్రిబ్యునల్ నిర్ణయించే ప్రకారమయినా తప్పదు. జాతీయస్థాయిలో వివిధ నదీ పరీవాహక రాష్ట్రాల మధ్య జలవనరుల పంపిణీకి ఇప్పటికే ఆమోదించిన సూత్రాలు, ప్రమాణాలు ఉన్నాయి. ఆ ప్రమాణాల ప్రకారం ఏ ఎగువరాష్ట్రమైనా శత్రుత్వం వహించినా, తలచుకున్నా దిగువ రాష్ట్రానికి అన్యాయం చేసే అవకాశం పెద్దగా లేదు. మరి కోస్తాంధ్ర, రాయలసీమలలో ఆందోళన ఎందుకు జరిగింది
ఇలా ప్రస్తుత ఆందోళనకు పునాదిగా ఉన్న అన్ని కారణాలూ నిరాధారమైనవని తేలినతర్వాత అంత పెద్ద ఎత్తున విద్యార్థులు, ప్రజలు ఆ ఆందోళనలో ఎందుకు పాల్గొన్నారనే ప్రశ్న తలెత్తుతుంది. మన సమాజంలో ఏదయినా ఒక కార్యక్రమంలో పాల్గొనే వారిలో అత్యధిక సంఖ్యాకులు ఆ కార్యక్రమపు లోతుపాతులు తెలుసుకుని పాల్గొనడంలేదు. అమాయకత్వం కొద్దీనో, ఎవరో ఒకరిని నమ్మి వారి వెనుక నడుస్తూనో పాల్గొంటారు. ఈ విషాదవాస్తవాన్ని అర్థం చేసుకుంటే ఆ ఆందోళనలలో విశాల భాగస్వామ్యానికి కారణం తెలుస్తుంది. నిజానికి అటువంటి సమయంలో ఆందోళనలకు నాయకత్వం వహించేవారు తమ వెనుక నడుస్తున్నవారికి ప్రతి సందర్భంలోనూ, ప్రతి విషయంమీదా విజ్ఞతతో వాస్తవాలు చెప్పవలసి ఉంటుంది. కాని కోస్తాంధ్ర, రాయలసీమ నాయకులు సంపూర్ణంగా అసత్యాలమీద, అర్థసత్యాలమీద, అతిశయోక్తులమీద, చరిత్ర వక్రీకరణలమీద ఆధారపడి ప్రజలను, విద్యార్థులను సమీకరించడానికి ప్రయత్నించారు. కేంద్ర హోంమంత్రి ప్రకటన తర్వాత, రాజ్యాంగం అధికరణం 3 ప్రకారం రాష్ట్రం ఏర్పాటు కేంద్రప్రభుత్వం చేతిలోనే ఉన్నదని తెలిసికూడ, శాసనసభ తీర్మానం అనే అబద్ధపు ప్రాతిపదికమీద, ఆందోళన జరిపితే కేంద్రం వెనక్కి తగ్గుతుందనే కుహనా వాదనతో కొందరు రాజకీయ నాయకులు ప్రజలను రెచ్చగొట్టారు. అంటే స్పష్టమైన రాజ్యాంగ వక్రీకరణతో ప్రజలను మోసంచేసి సమీకరించడానికి ప్రయత్నించారు. నిజానికి వారు సమైక్యాంధ్రప్రదేశ్ వల్ల ప్రయోజనాలు పొందుతున్న, హైదరాబాద్ నగరంలో స్వార్థ ప్రయోజనాలు ఉన్న పిడికెడు మంది వ్యాపారవేత్తలు, రాజకీయవేత్తలు మాత్రమే.
అటువంటి స్థితిలో అవతలిపక్షం లేవనెత్తుతున్న అబద్ధాలను, సందేహాలను, భయాలను నివృత్తి చేయవలసిన బాధ్యత న్యాయమైన పోరాటం చేసున్న ఉద్యమానికి ఉంటుంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షల నాయకత్వం గత యాభై సంవత్సరాలుగా, మరీముఖ్యంగా పది సంవత్సరాలకు పైగా తన డిమాండ్లు ఏమిటో ఎంతో సాహిత్యం, ఎన్నో గణాంకాలు, ఎన్నో వాదనలు తయారుచేసినప్పటికీ అవేవీ అవతలి పక్షానికి చేరవలసినంతగా చేరలేదు. అవతలివారికి తమ న్యాయమైన వాదనలు వినిపించడంలో తెలంగాణ నాయకుల వైఫల్యం, అనేకమంది అమాయకులు అవతలి పక్షంలో చేరడానికి దారితీసింది. భూగోళం మీద ఎక్కడ ఒక న్యాయమైన ప్రజాందోళన జరిగినా సవ్యంగా స్పందించి సంఘీభావం తెలిపిన ఘన చరిత్ర ఉన్న కోస్తాంధ్ర, రాయలసీమ ప్రజలు తమ పొరుగున ఉన్న సోదరుల న్యాయమైన ఆకాంక్షలను అర్థం చేసుకోలేకపోయారు, సమర్థించలేకపోయారు, సంఘీభావం ప్రకటించలేకపోయారు.
తెలంగాణ గురించి రాజకీయ పార్టీల వైఖరిలో స్పష్టత ఉందా?
మొదటి నుంచీ కూడ తెలంగాణ ప్రజల ఆకాంక్ష ఎంత న్యాయమైనదో, దానికి నాయకత్వం వహిస్తున్న రాజకీయనాయకుల వైఖరులు అంత అన్యాయంగా ఉంటున్నాయి. ఇది ఒక విషాద వాస్తవం. తెలంగాణ ప్రజల శ్రమతో, వనరులతో తెలంగాణలో మనుగడ సాగిస్తున్న డజనుకు పైగా దేశ స్థాయి, రాష్ట స్థాయి రాజకీయ పార్టీలలో ఒకటి రెండు మినహా మిగిలినవన్నీ తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు ఏదో ఒక సమయంలో ద్రోహం చేసినవే, అస్పష్టంగా మాట్లాడినవే. తెలంగాణ రాష్ట్ర సాధన కోసమే పుట్టిన పార్టీలలో కూడ తెలంగాణ ఆకాంక్షలకు ద్రోహం చేసిన తెలంగాణ ప్రజాసమితి, నవతెలంగాణ ప్రజాపార్టీ వంటివి ఉన్నాయి. అద్భుతమైన సమరశీల చరిత్ర కలిగిన తెలంగాణ ప్రజల అమాయకత్వం, నిస్సహాయత ఎటువంటివంటే ఇలా పదేపదే ద్రోహం చేసిన పార్టీలనే మళ్లీ మళ్లీ నమ్మక తప్పడం లేదు. ఈ నాయకుల, పార్టీల ద్రోహచరిత్రను చూపించి, అసలు తెలంగాణ ఆకాంక్షలనే అనుమానించే మేధావులు కూడ తయారయ్యారు. ఎన్ని పార్టీలు, ఎందరు నాయకులు ద్రోహంచేసినా, ఆ నాయకులు పాల్గొన్నా, మానుకున్నా తెలంగాణ ప్రజల పోరాటం ఆగలేదు. తమ వనరులు దోపిడీ కాగూడదని, వాటిమీద తమకే అధికారం ఉండాలని, తమకిచ్చిన వాగ్దానాలను నెరవేర్చాలని, తమ స్వాభిమానాన్ని గౌరవించాలని, తమకు స్వయంనిర్ణయాధికారం ఉండాలని ప్రజలు చేస్తున్న పోరాటమది. అది సహజ న్యాయసూత్రాల పోరాటం. అది అత్యంత ప్రజాస్వామికమైన, మానవీయమైన పోరాటం. కాని మన పార్లమెంటరీ రాజకీయ పార్టీలకూ, నాయకులకూ ఈ విలువల మీద, ప్రజల సృజనాత్మకత మీద ఎప్పుడూ నమ్మకం ఉండదు. అందువల్లనే ఆ పోరాటాలపట్ల, ప్రజలపట్ల రాజకీయనాయకులకు, పార్టీలకు స్థిరమైన, న్యాయమైన, చిత్తశుద్ధితో కూడిన వైఖరి ఉండడం లేదు.
మొట్టమొదట కాంగ్రెస్ చరిత్రంతా తెలంగాణకు ద్రోహం చేసిన, ఊగిసలాడిన చరిత్రే. ఈ చరిత్ర 1930ల చివరినుంచీ ఇవాళ్టిదాకా సాగుతూనే ఉంది. 1930లలో నిజాం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా హైదరాబాద్ ప్రజలు పోరాడుతున్నప్పుడు, ఆ పోరాటానికి నాయకత్వం వహించమని పిలిస్తే నిరాకరించింది కాంగ్రెస్. తమ పోరాటం బ్రిటిష్ వారిమీదనే తప్ప స్థానిక సంస్థానాలలోకి రాబోమని స్వయంగా గాంధీ నిజాం ప్రధానికి ఉత్తరం రాశారు. ఆయన మాటను కూడ ధిక్కరించి స్టేట్ కాంగ్రెస్ నిర్మించినవారు హైదరాబాద్ రాజ్య ప్రజలు. ఆతర్వాత, తెలంగాణ ప్రజల ఉమ్మడి పోరాట సంస్థగా ఆంధ్రమహాసభ విస్తరిస్తున్నప్పుడు, అందులో కమ్యూనిస్టుల ప్రాబల్యం పెరిగిపోయిందనే సాకుతో దాన్ని చీల్చి పోటీ ఆంధ్రమహాసభను ఏర్పాటు చేసినది కాంగ్రెస్. 1952లో హైదరాబాద్ విద్యార్థులు ముల్కీ ఆందోళన ప్రారంభించినపుడు కాల్పులు జరిపి ఏడుగురు విద్యార్థులను బలిగొన్నది కాంగ్రెస్. బ్రిటిష్ వారు వెళ్లిపోయినతర్వాత విద్యార్థులపై పోలీసులు కాల్పులు జరిపిన మొట్టమొదటి ఘటన ఇదే. ఆ తర్వాత రెండు సంవత్సరాలకు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఉండాలని ఫజల్ అలీ కమిషన్ సిఫారసు చేస్తే ఆ సిఫారసులు తుంగలో తొక్కినది కాంగ్రెస్. పెద్దమనుషుల ఒప్పందం రాసి అటూ ఇటూ ఎనిమిది మంది కాంగ్రెస్ నాయకులే సంతకాలు పెట్టి తెలంగాణను వంచించినది కాంగ్రెస్. ఆ ఒప్పందాన్ని అమలు చేయకుండా ప్రభుత్వం నడిపినది కాంగ్రెసే. తెలంగాణ ఆకాంక్షలు 1969లో వ్యక్తమయినప్పుడు క్రూరమైన నిర్బంధాన్ని ప్రయోగించినదీ, పోలీసు కాల్పులు జరిపి 370 మంది విద్యార్థి యువజనులను బలిగొన్నదీ కాంగ్రెస్ ప్రభుత్వమే. తెలంగాణ ప్రజాసమితి నాయకులను కొనివేసి తెలంగాణ ప్రజల వేలు తోనే తెలంగాణ ప్రజల కన్నుపొడిచినది కాంగ్రెస్. ఎనిమిది సూత్రాల పథకం, ఆరు సూత్రాల పథకం వంటి కుటిల పన్నాగాలను తయారుచేసి, వాటిని అమలు చేయకుండా ఉన్నది కాంగ్రెస్.
ఆరు సూత్రాల పథకం ప్రకారం రాష్ట్రపతి ఉత్తర్వులు, రాజ్యాంగ సవరణ చేసి అమలు చేయవలసి ఉండగా ఆ ఉత్తర్వులు తేవడానికే రెండు సంవత్సరాలు ఆలస్యం చేసింది. ఉత్తర్వులు వెలువడిన తర్వాత కూడ వాటిని అమలు చేయకుండా తాత్సారం చేసింది. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తమ రాజకీయ స్వార్థప్రయోజనాల కోసం తెలంగాణ నినాదం ఎత్తుకున్నది కాంగ్రెస్.
తెలుగుదేశం పార్టీని ఓడించడం కోసం తెలంగాణ ప్రజల ఆకాంక్షలను పావుగా వాడుకుని 2004 ఎన్నికల పొత్తుకుదుర్చుకుంది. యుపిఎ కామన్ మినిమమ్ ప్రోగ్రాంలో, రాష్ట్రపతి ప్రసంగంలో తెలంగాణ అంశం చేర్చి, ఒక్క అడుగు కూడ ముందుకు వేయకుండా మోసం చేసింది. ఏకాభిప్రాయ సాధన కావాలనే అనవసరపు మెలిక పెట్టి, అందుకోసం ప్రణబ్ ముఖర్జీ కమిటీ వేసి, దానికి మూడు నెలల గడువు విధించి కూడ అన్నిటినీ తుంగలో తొక్కింది కాంగ్రెస్. తెరాస మంత్రులు కాబెనెట్ లో ఉండగానే తెలంగాణ వ్యతిరేక నిర్ణయాలెన్నో తీసుకున్నది కాంగ్రెస్. ఏ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు హామీ మీద ఎన్నికలలో గెలిచాడో ఆ హామీని పదే పదే అపహాస్యం చేసిన దుర్మార్గ చరిత్ర కాంగ్రెస్ ముఖ్యమంత్రిది. జి వో 610 అమలు చేస్తామని ప్రకటించి కమిటీల మీద కమిటీలతో మసిపూసి మారేడుకాయ చేసినది కాంగ్రెస్ ప్రభుత్వం. చివరికి ఎన్నికల ముందు రోశయ్య కమిటీని ఏర్పాటు చేసి మళ్లీ మోసం చేయడానికి ప్రయత్నించింది కాంగ్రెస్. తెలంగాణలో ఎన్నికలు అయిపోగానే కోస్తాంధ్ర, రాయలసీమలలో విద్వేషాలు రెచ్చగొట్టడానికి ప్రయత్నించింది. తెలంగాణ అకాంక్షల ప్రకటనను అడుగడుగునా అడ్డుకుంటున్నది కాంగ్రెస్. చివరికి ప్రక్రియ ప్రారంభమయిందని చెప్పి కూడ దాన్ని తప్పించడానికి కుటిల యత్నాలు చేస్తున్నది కాంగ్రెస్.ఇక తెలుగుదేశం పుట్టిన నాటినుంచీ సమైక్యాంధ్ర పార్టీగా, కోస్తాంధ్ర సంపన్నుల ప్రయోజనాలు నెరవేర్చే పార్టీగానే ఉంది. 1985లో ముఖ్యమంత్రి ఎన్ టి రామారావు రాయలసీమ ఉద్యోగులకు మేలు చేసే జి వో ఒకటి తెచ్చినప్పుడు, అప్పటికి పది సంవత్సరాలుగా రాష్ట్రపతి ఉత్తర్వుల కొనసాగింపు ఉత్తర్వులు రాలేదని తెలంగాణ ఎన్ జి వో లు గుర్తు చేశారు. అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం జి వో 610 ని తెచ్చింది. అది మూడు నెలలలో అంటే 1986 మార్చ్ 31 లోపు అమలు కావలసి ఉండినా, తర్వాత తెలుగుదేశం అధికారంలో ఉన్న మూడు సంవత్సరాలలో గాని, మళ్లీ అధికారానికి వచ్చిన తర్వాత పది సంవత్సరాలలో గాని ఆ జి.వో. ను అమలు చేయడానికి ఎటువంటి ప్రయత్నమూ చేయలేదు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నకాలంలో శాసనసభలో తెలంగాణ అనే మాట వినిపించగూడదని స్పీకర్ ద్వారా ఆదేశం ఇప్పించాడు. 2004 ఎన్నికల సందర్భంలో కాంగ్రెస్ రాష్ట్రాన్ని చీల్చబోతున్నదనీ, తాము సమైక్యతకోసం నిలబడుతున్నామనీ, ఇది ఒక రెఫరెండం అనీ చంద్రబాబు నాయుడు ప్రకటించాడు. ఓడిపోయిన తర్వాత కూడ 2008 వరకూ ఆ పార్టీ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రానికి వ్యతిరేకంగానే ఉండింది. ప్రజల నుంచి ఒత్తిడి వచ్చిన తర్వాత 2008లో ఈ సమస్య చర్చించి నిర్ణయం తీసుకోవడానికి ఒక కమిటీ వేసి, మూడు నెలలు చర్చించి తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును ఆమోదిస్తూ తీర్మానం చేశారు. ఆ తీర్మానాన్ని 2008 అక్టోబర్ 9న పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ప్రకటించారు. 2009 ఎన్నికల ప్రణాళికలో కూడ చేర్చారు. తెరాసతో ఎన్నికల పొత్తు పెట్టుకున్నారు. 2009 డిసెంబర్ 7 న జరిగిన అఖిలపక్ష సమావేశంలోకూడ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రానికి అనుకూలమైన తీర్మానాన్ని ఆమోదించారు. డిసెంబర్ 10 తర్వాత మాత్రం ఎక్కడ వీలయిన మాట అక్కడ చెపుతూ కోస్తా, రాయలసీమ నాయకులు సమైక్యాంధ్రకు అనుకూలంగానూ, తెలంగాణ నాయకులు తెలంగాణకు అనుకూలంగానూ మాట్లాడుతున్నారు. పార్టీ మొత్తానికి ఒక వైఖరి ఉందా అనేది అనుమానమే.
భారతీయ జనతాపార్టీ 1969 ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో, 1972 జై ఆంధ్ర ఉద్యమంలో ఎటువంటి వైఖరి తీసుకున్నా సాధారణంగా చిన్నరాష్ట్రాలకు అనుకూలమైన వైఖరి తీసుకుంటుంది. ఆ నేపథ్యంలోనే 1998లో చత్తీస్ ఘడ్, జార్ఖండ్, ఉత్తరాంచల్ రాష్ట్రాలను ప్రకటించి తెలంగాణలో కూడ ఆశలను మేల్కొలిపింది. అదేసమయంలో కాకినాడలో జరిగిన సమావేశంలో ప్రత్యేక రాష్ట్రానికి అనుకూలమైన తీర్మానం చేసింది. కాని ఆ తర్వాత ఐదు సంవత్సరాల పాలనలో ఆమాటే ఎత్తలేదు. 2000 లో నిజాంకాలేజి గ్రౌండ్ లో మాట్లాడుతూ అప్పుడు కేంద్ర హోంమంత్రిగా ఉండిన ఎల్ కె అద్వానీ తెలంగాణలో రాష్ట్రానికి అనుకూలంగా ప్రజాఉద్యమం లేదని, రాజధాని దూరంగా ఉన్నవాళ్లు ప్రత్యేక రాష్ట్రం కోరవచ్చుగాని, హైదరాబాదు తమ మధ్యనే ఉన్న తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోరడం ఏమిటని అన్నారు. అలాగే రాష్ట్ర శాసనసభ తీర్మానం చేస్తేనే ప్రత్యేక రాష్ట్రం ఏర్పడుతుందని ఒక రాజ్యాంగ వక్రీకరణ కూడ చేశారు. ఆ తర్వాత తెలుగుదేశంతో దోస్తీ బెడిసిపోయినతర్వాత, తెలంగాణ పట్ల తమ వైఖరి మారడానికి కారణమంతా తెలుగుదేశందేనని నెపం వాళ్లమీదికి నెట్టారు. 2004 ఎన్నికల ముందరి నుంచీ తెలంగాణకు అనుకూలమని చెప్పుకుంటున్నారు.
2008లో పార్టీ పెట్టబోయేముందు సినిమానటుడు చిరంజీవి ముందున్న అనేక ప్రశ్నలలో తెలంగాణపై వైఖరి ఏమిటనేది ప్రముఖంగా ఉండింది. పార్టీ ప్రకటించినరోజున, ఆ తర్వాత తిరుపతి బహిరంగ సభలోనూ ఆయన ఆ మాట దాటవేశారు. తర్వాత తెలంగాణ యాత్ర సందర్భంగా ఒకటి రెండు చోట్ల ప్రశ్నలు వచ్చాక, తాము సామాజిక తెలంగాణకు అనుకూలమని ప్రకటించారు. ఆ సామాజిక తెలంగాణ ఏమిటో ఆయన ఎక్కడా వివరించలేదు. సామాజిక న్యాయమే తమ ధ్యేయమని అన్నారు గనుక తెలంగాణ ఏర్పాటును ఆయన సామాజిక న్యాయంలో భాగంగా చూస్తున్నారని అనిపించింది. 2009 ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును అంగీకరిస్తున్నట్టు ప్రకటించారు. డిసెంబర్ 7 అఖిలపక్ష సమావేశంలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును సమ్మతించారు. కాని డిసెంబర్ 10 తర్వాత హఠాత్తుగా మాట మార్చి, తాము సమైక్యాంధ్రను కోరుకుంటున్నామని, కోస్తాంధ్ర, రాయలసీమలలో యాత్ర ప్రారంభించారు.
భారత కమ్యూనిస్టుపార్టీ వైఖరి 1969 నుంచి 2007 వరకూ కూడ రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా ఉండేది. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు అన్యాయాలు జరిగిన మాట నిజమేననీ, ఆ అన్యాయాలను సరిదిద్దడానికి ప్రత్యేక ప్యాకేజీలు ఇవ్వాలనీ సిపిఐ కోరుతుండేది. కాని ప్యాకేజీలతో సమస్య పరిష్కారం కాదని గుర్తించి రాష్ట్ర విభజనకు అనుకూలంగా 2007లో తీర్మానించారు. ప్రస్తుత ఆందోళనలో మాత్రం భాగం పంచుకోబోవడంలేదని నాయకులు ప్రకటిస్తున్నారు. ఎంఐఎం 1969లో ఉద్యమాన్ని వ్యతిరేకించిందిగాని, ప్రస్తుతం కొంత మౌనాన్నీ, కొంత మద్దతునూ ప్రకటిస్తున్నది. భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) ఒక్కదానికే తెలంగాణ విషయంలో ఏమాత్రం మార్పులేని స్థిరమైన వైఖరి ఉంది. 1969 నుంచీ కూడ రాష్ట్ర విభజన భాషా ప్రయుక్త ప్రాతిపదికను దెబ్బతీస్తుందనీ కనుక తాము వ్యతిరేకిస్తున్నామనీ చెపుతూ వస్తున్నారు. ఎన్ని పేర్లు మారినప్పటికీ ఇవాళ భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు)గా ఉన్న పార్టీ ఒక్కటే 1969 ఉద్యమం నాటినుంచీ ఇవాళ్టిదాకా స్థిరంగా తెలంగాణ ప్రజా ఆకాంక్షలను, ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును కూడ సమర్థిస్తోంది.
విద్యార్థులకూ, ప్రజలకూ విజ్ఞప్తి
ఈ దుస్థితి నుంచి బయటపడి అన్నిప్రాంతాలలోని ప్రజాస్వామికవాదులు, ప్రజలు, విద్యార్థులు రాష్ట్ర విభజన ప్రక్రియను స్వాగతించాలి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభిస్తున్నామని కేంద్రం చేసిన ప్రకటనను తార్కికంగా కొనసాగించమని డిమాండ్ చేయాలి. వారి స్వార్థప్రయోజనాల కొరకు తమను అబద్ధాలతో మోసపుచ్చి బలి చేస్తున్న రాజకీయవ్యాపారుల కుటిల పన్నాగాలను తిప్పికొట్టాలి. ఇప్పటికైనా కోస్తాంధ్ర, రాయలసీమ ప్రజలు, విద్యావంతులు, తమ భావోద్వేగాలను చరిత్రను, వాస్తవాలను అర్థం చేసుకుని తెలంగాణ ఏర్పాటును ఎందుకు సమర్థించాలో తెలుసుకోవాలి. అసలు సమస్యల మీద అర్థవంతమైన చర్చకు, పరిష్కారానికి దారితీయాలి. తెలంగాణలో అరవై సంవత్సరాల ఆకాంక్షలు, నలభై సంవత్సరాలుగా పోరాట వ్యక్తీకరణలు, పదమూడు సంవత్సరాలుగా ఆరకుండా రగులుతున్న ఉద్యమం ఏమిటో అర్థం చేసుకోవాలి.
సాగుతున్న ఉద్యమం తెలంగాణ ప్రజలకూ పాలకులకూ మధ్య, 53 సంవత్సరాలుగా సాగుతున్న పాలకవిధానాలతో ఘర్షణే గాని తెలంగాణ ప్రజలకూ ఆంధ్ర, రాయలసీమ ప్రజలకూ మధ్య ఘర్షణ కాదు. నిజానికి తెలంగాణకు ద్రోహం చేసిన పాలకులు ఉత్తరాంధ్రకూ, పల్నాడుకూ, రాయలసీమలో అనేక ప్రాంతాలకూ కూడ ద్రోహం చేస్తున్నారు. ఆ ద్రోహాన్ని గుర్తించిన నాలుగుకోట్ల తెలంగాణ ప్రజలు ఇవాళ ఎలుగెత్తుతున్నారు. దానికి రాజకీయ పరిష్కారాన్ని తక్షణం చూపవలసి ఉంది. తెలంగాణ ప్రజల న్యాయమైన ఆకాంక్షలను మొత్తం తెలుగుజాతి మాత్రమే కాదు, అణచివేతకూ దోపిడీకీ పీడనకూ గురవుతున్న ప్రజలందరూ సమర్థించవలసి ఉంది. ఇది కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర, రాయలసీమలలో కూడ ప్రజానీకం సమర్థించవలసిన, సంఘీభావం ప్రకటించవలసిన, పాల్గొనవలసిన సమస్య. ఇది ప్రాంతీయ విద్వేషాల సమస్య కాదు, అన్ని ప్రాంతాల ప్రజలు సంఘీభావం ప్రకటించవలసిన న్యాయమైన ఆకాంక్షల సమస్య.
ప్రాంతాల వాటాలు
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కోస్తాంధ్ర రాయలసీమ
విస్తీర్ణం (లక్షల చ.కి.మీ.) 2.75 1.14 0.92 0.67
(శాతం) (41.7) (33.7) (24.5)
జనాభా (కోట్లు) 7.62 3.09 3.17 1.35
(శాతం) (40.6) (41.5 ) (17.7)
(మూలం : స్టాటిస్టికల్ అబ్‌స్ట్రాక్ట్ ఆంధ్రప్రదేశ్, 2008)
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కోస్తాంధ్ర రాయలసీమ
అమ్మకపు పన్ను వసూళ్లు 8,533.54 6463.65జ 1787.39 282.38
(2005-06) (రు.కోట్లు) (75.7) (20.9) (3.3)
(మూలం : స్టాటిస్టికల్ అబ్‌స్ట్రాక్ట్ ఆంధ్రప్రదేశ్, 2008)
జ హైదరాబాద్ మినహాయిస్తే మిగిలిన తెలంగాణలో ఇది రు. 520.32 కోట్లు (6.09 శాతం)
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కోస్తాంధ్ర రాయలసీమ
అక్షరాస్యత (శాతం) 60.47 57.10జ 62.13 59.70
ప్రాథమిక పాఠశాలలు 62,464 24558 25293 12613
(2007-08) (శాతం) (39.3) (40.5) (20.2)
జూనియర్ కాలేజీలు 4032 1845జజ 1588 599
(2007-08) (శాతం) (45.7) (39.3) (14.8)
డిగ్రీ కాలేజీలు మొత్తం 358 120 238న
(శాతం) (33) (67)
వీటిలో ప్రభుత్వ కాలేజీలు 179 67 112న
(శాతం) (37) (63)
(మూలం : స్టాటిస్టికల్ అబ్‌స్ట్రాక్ట్ ఆంధ్రప్రదేశ్, 2008)
జ హైదరాబాద్ మినహాయిస్తే మిగిలిన తెలంగాణలో ఇది 54.77 శాతం
జజ హైదరాబాద్ మినహాయిస్తే మిగిలిన తెలంగాణలో 1519 (37.6 శాతం)
న ఇవి ప్రభుత్వ, ఎయిడెడ్ ప్రైవేట్ కళాశాలలు మాత్రమే. ఇవి కాక పూర్తి ప్రైవేట్ కళాశాలల గణాంకాలు లేవు.
ప్రాంతాల వాటాలు
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కోస్తాంధ్ర రాయలసీమ
నదీ పరీవాహక ప్రాంతాలు
కృష్ణా (శాతం) 68.5 31.5
గోదావరి (శాతం) 79.0 21.0
ఈ రెండు నదుల మీద ప్రాజెక్టుల ద్వారా సాగవుతున్న భూమిలో తెలంగాణ వాటా 19.7 శాతం, కోస్తాంధ్ర వాటా 75.6 శాతం
వ్యవసాయ సాగుభూమి విస్తీర్ణం
(2006-07)
మొత్తం నీటిపారుదల సౌకర్యం
ఉన్న భూమి (లక్షల హెక్టార్లు) 60.69 24.08 29.66 6.82
(శాతం) (39.6) (48.8) (11.8)
కాలువల ద్వారా 16.22 3.21 12.27 1.09
(శాతం) (19.7) (75.6) (6.7)
వ్యవసాయ సాగుభూమి విస్తీర్ణం
(2007-08)
కాలువ ద్వారా (లక్షల హెక్టార్లు) 16.10 2.22 12.55 1.33
(శాతం) (13.7) (77.9) (8.2)
బావుల ద్వారా 22.87 10.73 5.49 4.24
(శాతం) (46.90) (24.00) (18.5)
(మూలం : స్టాటిస్టికల్ అబ్‌స్ట్రాక్ట్ ఆంధ్రప్రదేశ్, 2008)
Subscribe to:
Post Comments (Atom)
మంచి సమాచారం చాలా శ్రమ కోర్చినట్టున్నారు .. అభినందనలు
ReplyDelete