ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య మనస్సులో ఉన్న మాటే రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖామంత్రి బొత్స సత్యనారాయణ నోటి నుంచి జాలువారినట్టుగా ఉందని పలువురు రాజకీయ నేతలు అభిప్రాయపడుతున్నారు. లేకుంటే బొత్స అలాంటి వ్యాఖ్యలు చేసి ఉండరని వారు అంటున్నారు. పైపెచ్చు.. ముఖ్యమంత్రి పదవిని చేపట్టాలనే కోరిక కూడా బొత్సను ఈ తరహా వ్యాఖ్యలు చేయించేలా చేసిందని వారు అంటున్నారు. రాష్ట్ర రాజకీయాలను కమ్మ, రెడ్డి వర్గాలే శాసిస్తున్నాయి. ముఖ్యమంత్రి పదవులను కూడా ఈ రెండు వర్గాలకు చెందిన నేతలో మార్చిమార్చి అనుభ విస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో "మార్పు"తో రాజకీయ అరంగేట్రం చేసిన కాపు వర్గానికి చెందిన మెగాస్టార్ చిరంజీవి అనుకున్న లక్ష్యాన్ని సాధించలేక పోయారు. తనకున్న కోట్లాది మంది అభిమానులను ఓట్ల రూపంలో మలచుకోలేక పోయారు. ఫలితంగా ఆయన స్థాపించిన పార్టీ 17 శాతం ఓట్లతో 18 సీట్లకే పరిమితమైంది. ఇదే వర్గానికి చెందిన మంత్రి బొత్స సత్యనారాయణ ప్రస్తుతం ముఖ్యమంత్రి పీఠంపై కన్నేశారు. ఇదే అంశాన్ని ఆయన బహిరంగంగా కూడా వ్యక్తం చేశారు. రాష్ట్ర విడిపోతే నష్టమేటని ఆయన ప్రశ్నించారు.
అంతేకాకుండా, రెండు ముఖ్యమంత్రి పదవులు, రాష్ట్రానికి మరిన్ని నిధులు వస్తాయని ఉచిత సలహాలు కూడా ఇస్తున్నారు. మొన్నటి వరకు సమైక్యాంధ్రకు మద్దతు తెలిపిన ఆయన అకస్మాత్తుగా ప్లేటు ఫిరాయించడానికి కారణం ఏమిటనే విషయంపై రాజకీయ నిపుణులు ఆరా తీస్తున్నారు. రాష్ట్రం విడిపోతే ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటవు తుంది. ఇందులో రాయలసీమలోని బలిజ వర్గానికి చెందిన ప్రజలు మెజారిటీగా అవతరిస్తారు. తూర్పు కాపు వర్గానికి చెందిన బొత్స సత్యనారాయణకు ఇది అనుకూలంగా మారి, ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందని కాంగ్రెస్ నేతలే అంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో కమ్మ, రెడ్డి వర్గానికి చెందిన నేతల ముందు బొత్స పాచిక పారేలా కనిపించడం లేదు. అందువల్లే ప్రత్యేక రాష్ట్రం విడిపోతే మంచిదని అంటున్నారు. ఇపుడు తన వర్గానికి జరుగుతున్న అన్యాయాన్ని ఎత్తి చూపక పోయినట్టయితే తాను ముఖ్యమంత్రి రేసులో నిలబడే అవకాశం లేదని గ్రహించిన బొత్స.. రాష్ట్ర విభజన వ్యాఖ్యలు అందుకున్నట్టు వారు అంటున్నారు. అదేసమయంలో ముఖ్యమంత్రి రోశయ్య సైతం రాష్ట్ర విభజనకు సానుకూలంగా ఉన్నట్టు తెలుస్తోంది. అందువల్లే డిసెంబరు నెలలో ఢిల్లీ వెళ్లినపుడు తన మనస్సులోని మాటను వెల్లడించినట్టు సమాచారం. ఇదే విషయాన్ని రోశయ్య మంత్రి బొత్స ద్వారా బహిరంగ పరిచినట్టు మరో వాదనా వినొస్తుంది.
====================
అసలు ఆంధ్ర ప్రజలు విడిపోవాలనుకుంటున్నారా...?!!
వైఎస్ రాజశేఖర రెడ్డి దివంగతులై రోజులు గడవకముందే రాష్ట్ర విభజన డిమాండ్ ఒక్కసారిగా ప్రజలపైకి దూసుక వచ్చింది. ఆ తర్వాత ఎన్నో మలుపులు తిరుగుతూ తాజాగా మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలతో మరోసారి వేడి రాజుకుంది. "రాష్ట్రాన్ని విడగొడతాం" అని కేంద్రం ప్రకటించినప్పుడు ఉవ్వెత్తున ఎగిసిపడిన సీమాంధ్ర నాయకులు క్రమంగా ఒక్కొక్కరూ ప్లేటు ఫిరాయిస్తున్నారు. ఈ ఫిరాయింపుల వెనుక ఆయా నాయకుల వ్యక్తిగత స్వార్థ ప్రయోజనాలున్నాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రం విడిపోతే మంత్రి బొత్సకు ముఖ్యమంత్రి పదవి వచ్చే అవకాశం ఉన్నదన్న ఊహాగానాలు అప్పుడే ఊపందుకున్నాయి. మరోవైపు అధిష్టానం మద్దతుతోనే బొత్స ఈ వ్యాఖ్యలు చేశారన్న విమర్శలు సైతం వినవస్తున్నాయి. బొత్స వ్యాఖ్యలపై సీమాంధ్రలో ఆగ్రహజ్వాలలు పెల్లుబుకుతున్నాయి. ఇదిలావుండగానే మంగళవారం గుంటూరు జిల్లాకు చెందిన మరొక మంత్రి మోపిదేవి వెంకట రమణ సైతం "విభజన" తప్పులేదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు వార్తలు వచ్చాయి. అయితే వెంకట రమణ తాను బొత్స వ్యాఖ్యలను సమర్థించలేదనీ, అదే సమయంలో విమర్శించనూ లేదని తేల్చి చెప్పారు. కొన్ని టీవీ ఛానళ్లు తన వ్యాఖ్యలను వక్రీకరించాయని వెల్లడించారు.
ఏదేమైనా ఉద్యమంలో ఎవరికెంత ప్రయోజనం చేకూరుతుందన్న అంశంలో స్పష్టత వచ్చిన నేపధ్యంలోనే ఒకరొకరుగా సమైక్య గానాన్ని సవరించుకుని విభజన గానం అందుకుంటున్నట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వీటన్నిటినీ ప్రక్కనపెడితే అసలు ఆంధ్ర ప్రజానీకం ఏమనుకుంటున్నారూ...? విడిపోవాలనుకుంటున్నారా...? కలిసి ఉండాలనుకుంటున్నారా...? కేంద్రం నియమించిన శ్రీకృష్ణ కమిటీ ఈ విషయాన్ని నిగ్గు తేల్చేందుకు రెండ్రోజుల్లో రాష్ట్ర రాజధానికి రాబోతోంది. ఈ పరిస్థితిలో రాష్ట్ర మంత్రులలో కొందరు విభజన గళం అందుకోవడం చర్చనీయాంశంగా మారింది.
==========================
అభిప్రాయాలు వ్యక్తం చేయడంలో తప్పులేదు: అంబటి
తమతమ వ్యక్తిగత అభిప్రాయాలను వ్యక్తం చేయడంలో ఎలాంటి తప్పులేదని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి అంబటి రాంబాబు అభిప్రాయపడ్డారు. ఆయన మంగళవారం అసెంబ్లీ ప్రాంగణంలో మీడియా పాయింట్ వద్ద విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర విభజనపై ఎవరి అభిప్రాయం వారు వ్యక్తం చేయడంలో తప్పులేదన్నారు . ఇందులోభాగంగానే మంత్రి బొత్స సత్యనారాయణ తన అభిప్రాయాలను వ్యక్తం చేసినట్టుగా భావిస్తున్నట్టు చెప్పుకొచ్చారు. జస్టీస్ శ్రీకృష్ణ కమిటీని ఏర్పాటు చేసింది కూడా ఇందుకే కదా అని గుర్తు చేశారు. తాను వ్యక్తి గతంగా సమైక్యవాదిని. అలాగే, కమిటీ ఎదుట తన వ్యక్తిగత అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తానని చెప్పారు. కేంద్రం కమిటీని నియమించింది ఎవరి అభిప్రాయం వారు చెప్పాలనే కదా అని అంబటి ప్రశ్నించారు. ఇకపోతే.. తెలంగాణ ప్రాంతంలో జరిగే ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పోటీ చేసి తీరుతుందని ఆయన నొక్కివక్కాణించారు. మొత్తం 12 సీట్లకు గాను కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలను కైవసం చేసుకుంటుందని అంబటి రాంబాబు జోస్యం చెప్పారు.
================================
(సోర్సు-MSN న్యూస్)
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment