శుక్రవారం, 12 ఫిబ్రవరి 2010( 11:14 IST )
గత కొద్ది రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు ఆసక్తిగా ఎదురు చూస్తున్న జస్టిస్ శ్రీ కృష్ణ కమిటీ విధి విధానాలను కేంద్ర హోం మంత్రిత్వశాఖ శుక్రవారం ఉదయం ప్రకటించింది. ఈ కమిటీ కాలపరిమతిని ఈ ఏడాది డిసెంబరు 31గా నిర్ణయించింది. ఈ కమిటీ తన విధులను నిర్వర్తించేందుకు ఢిల్లీలో ప్రధాన కార్యాలయం ఏర్పాటు చేయడంతో పాటు రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోను కార్యాలయం ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సూత్ర ప్రాయంగా అంగీకారం తెలిపింది. హోంశాఖ ప్రకటించిన శ్రీకృష్ణ కమిటీ విధి విధానాలు ఈ విధంగా ఉన్నాయి:
* ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు జరిగిన అభివృద్ధిపై సమీక్ష జరపాలి.
* ప్రత్యేక రాష్ట్రం, సమైక్యాంధ్ర డిమాండ్‌లను పూర్తిస్థాయిలో పరిశీలించాలి.
* రాష్ట్రంలోని వివిధ వర్గాల ప్రజలు, సంస్థల నుంచి అభిప్రాయ సేకరణ జరపాలి.
* రాష్ట్రంలో ఇటీవల చోటుచేసుకున్న పరిణామాల ప్రభావాన్ని పరిశీలించాలి.
* రాష్ట్రంలోని రాజకీయ పార్టీల అభిప్రాయాలు సేకరించాలి
* పరిశ్రమలు, వ్యాపార, వాణిజ్య, కార్మిక, రైతు, మహిళ, విద్యార్థి సంఘాలతో సంప్రదింపులు జరపాలి
* వివిధ వర్గాలు సూచించే పరిష్కారాలను ప్రాతిపదికగా చేసుకుని కార్యాచరణ ప్రణాళిక సిఫారసు చేయాలి.
రాష్ట్రంలో తలెత్తిన సంక్షోభాన్ని త్వరితగతిన నివారించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టినట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. జస్టిస్ శ్రీ కృష్ణ కమిటీ అనుభవజ్ఞులైన వారు కాబట్టి రాష్ట్రంలోని ప్రజల మనోభావాలను దెబ్బ తీయకుండా తమ నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వానికి వెల్లడిస్తారని విశ్లేషకులు ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇదిలావుండగా జస్టిస్ శ్రీ కృష్ణ కమిటీ తొలి సమావేశం శనివారం మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో జరుగనుంది.
(source : MSN News)
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment