బుధవారం, 27 జనవరి 2010( 12:51 IST )
==========================
తెలంగాణ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ నేతలు తక్షణం ఢిల్లీకి రావాల్సిందిగా అధిష్టానం కబురు పంపింది. దీంతో ఎమ్మెల్యేలు కె.జానారెడ్డి, ఆర్.దామోదర్ రెడ్డిలు బుధవారం ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. మధ్యాహ్నాం ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు పార్టీ అధినేత్రి సోనియా గాంధీతో భేటీ అయ్యే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. జాయింట్ యాక్షన్ కమిటీ రాజీనామాలకు డెడ్ లైన్‌లు విధించిన నేపథ్యంలో అధిష్టానంపై ఒత్తిడి పెరిగింది. పైపెచ్చు కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుల వ్యవహారంపై తెలంగాణ ప్రజలు విమర్శలు గుప్పిస్తున్నారు. వీటన్నింటిని పరిగణంలోకి తీసుకున్న హైకమాండ్ సమస్యకు పరిష్కార మార్గం కనుగొనేందుకు నడుం బిగించింది. ఇదిలావుండగా, ఇప్పటికే ఇరు ప్రాంతాలకు చెందిన నేతల అభిప్రాయాలు తెలుసుకున్నామని, ఢిల్లీ ఎవరూ రానవసరం లేదని, వస్తే సమస్య పరిష్కారం మరింత జాప్యం జరుగుతుందని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి వీరప్ప మొయిలీ మంగళవారం హెచ్చరించారు. ఈ నేపథ్యంలో.. బుధవారం ఢిల్లీకి రావాల్సిందిగా ఊహించని పిలుపు రావడం ప్రస్తుతం ప్రాధాన్యత సంతరించుకుంది.
==============================
తెలంగాణకు "విదర్భ" తరహా ప్రత్యేక ప్యాకేజీ?
==============================
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనే అంశం భవిష్యత్‌లో శాశ్వతంగా తలెత్తకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపడుతున్నాయి. తెలంగాణ ప్రాంతానికి జరిగిన అన్యాయాన్ని గుర్తిస్తూనే ఆ ప్రాంతాన్ని ఇకపై అభివృద్ధిపథంలో నడిపించేందుకు కేంద్రం ప్రణాళికలు రచిస్తోంది. ఇందుకోసం ప్రభుత్వంతో కాకుండా, గవర్నర్ ద్వారా ప్రత్యేక నివేదికను తెప్పించుకున్నట్టు సమాచారం. ప్రస్తుతం తెలంగాణలో ఉన్న వాస్తవ పరిస్థితులకు దర్పణం పట్టేలా ఈ నివేదిక ఉన్నట్టు వినికిడి. ప్రస్తుతం తెలంగాణ కోసం జరుగుతున్న ఆందోళనలను చల్లార్చడంతో పాటు ఈ సమస్య నుంచి బయటపడేందుకు ఈ చర్యలు చేపట్టింది. ఇందులోభాగంగా మహారాష్ట్రలోని విదర్భ అభివృద్ధికి ఇచ్చినట్లుగానే తెలంగాణా అభివృద్ధికి 20 వేల కోట్ల రూపాయల ప్యాకేజీ ఇవ్వాలని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసినట్లు తెలిసింది.
ప్రత్యేక తెలంగాణ, సమైక్య రాష్ట్ర ఆందోళనల వల్ల కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇరకాటంలో పడిన విషయం తెల్సిందే. తెలంగాణా ప్రాంత అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై గవర్నర్ నరసింహన్ కేంద్రానికి నివేదిక పంపినట్లు సమాచారం. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి గురించి ఆలోచిస్తున్నామని ఇటీవల జరిగిన శ్రీకాకుళం జిల్లా పర్యటనలో ముఖ్యమంత్రి రోశయ్య ప్రకటించక ముందే ఈ నివేదిక కేంద్రానికి చేరినట్టు తెలుస్తోంది.
అటు అభివృద్ధితో పాటు నీటి పంపకాల్లోనూ, ఉద్యోగ నియామకాల్లోనూ తెలంగాణాకు అన్యాయం జరిగిందని వస్తున్న విమర్శల నేపథ్యంలో తమకు తెలంగాణ అభివృద్ధి గురించి ప్రత్యేకంగా కృషి చేయాలన్న తపన ఉందని చెప్పడానికి ప్రభుత్వం తన వంతు కృషి చేస్తోంది.
ఇతే తరహా డిమాండ్ ఉత్పన్నమైనపుడు విదర్భ ప్రాంత అభివృద్ధికి కేంద్రం 15 వేల కోట్ల రూపాయల ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించిన విషయం తెల్సిందే. ఇదే తరహాలో తెలంగాణ ప్రాంత అభివృద్ధికి 20 వేల కోట్ల రూపాయల ప్యాకేజీ ఇవ్వాలని కేంద్రానికి ప్రభుత్వం లేఖ రాసినట్లు తెలిసింది. ఈ అంశంపైనే తెలంగాణ నేతలతో కాంగ్రెస్ అధిష్టానం పలు దఫాలుగా చర్చలు జరిపినట్టు సమాచారం. ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణ సమస్యకు పరిష్కారం లభించడం అసాధ్యమని కాంగ్రెస్ భావిస్తోంది. అందువల్ల ఈ సమస్యకు పరిష్కార మార్గం కనుగొన్నట్టుగా చెప్పేలా ఒక త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసి, ఆ తర్వాత ప్రత్యేక ప్యాకేజీని తెరపైకి తీసుకుని రావాలని కాంగ్రెస్ కోర్ కమిటీ భావిస్తున్నట్టు తెలుస్తోంది.
============================
(source: MSN News)
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment