జనవరి 28వ తేదీన తెలంగాణ ప్రాంత నాయకులందరూ పార్టీలకతీతంగా మూకుమ్మడి రాజీనామాలు చేసి రాజ్యాంగ సంక్షోభం సృష్టించాలని భావించిన తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ వ్యూహాన్ని కేంద్రమంత్రి చిదంబరం తిప్పికొట్టారు. తెలంగాణ సమస్య పరిష్కారానికి ఓ కమిటీ వేయనున్నట్టు గురువారం ఢిల్లీలో ఒక ప్రకటన చేసి జేఏసీని దిక్కుతోచని స్థితిలోకి నెట్టేశారు. చిదంబరం ప్రకటనతో తెలంగాణా జేఏసీలోని కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. దీనికి ప్రధాన కారణం... తమ మెడపై జేఏసీ పెట్టిన కత్తిని అతి చాకచక్యంగా కేంద్రం తప్పించిందని వారు సంబరపడి పోతున్నారు. జిత్తులుమారి చిదంబరం ప్రకటనలోని అసలు రహస్యం పక్కన పెట్టిన కాంగ్రెస్ నేతలు ప్రస్తుత పరిస్థితుల్లో ఊపిరి పీల్చుకున్నారు. కేంద్రం తీసుకున్న నిర్ణయం నూటికి నూరుపాళ్లు సరైందని అంటున్నారు.
అదేసమయంలో చిదంబరం ప్రకటనపై జేఏసీలో ఆగ్రహావేశాలు వెల్లువెత్తుతున్నాయి. కమిటీ పేరుతో తెలంగాణా అంశాన్ని మరికొన్నేళ్లు కోల్డ్ స్టోరేజీలో పెట్టేందుకు కేంద్రం కుట్ర పన్నిందని దుయ్యబడుతోంది. విభజనపై స్పష్టమైన హామీతో పాటు తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుకు కట్టుబడి ఉన్నట్టు ప్రకటించాలని డిమాండ్ చేస్తోంది. నిర్ధిష్ట కాలపరిమితి లేకుండా కమిటీ ఏర్పాటు వల్ల ఒనగూరే ప్రయోజనం శూన్యమని జేఏసీ కన్వీనర్ కోదండరామ్ అంటున్నారు. ఇప్పటికే ఫజల్ ఆలీ, ప్రణబ్ ముఖర్జీ, రోశయ్య కమిటీలు ఉన్నాయని, వీటితో ప్రజలు విసిగి వేసారి పోయారన్నారు.
మరోవైపు చిదంబరం ప్రకటనతో ఖంగుతిన్న తెలంగాణా తెలుగుదేశం నేతలు అధినేత చంద్రబాబుతో హుటాహుటిన సమావేశమై సమాలోచనలు చేస్తున్నారు. భవిష్యత్ వ్యూహరచనపై సుదీర్ఘ మంతనాలు జరుపుతున్నారు. మొత్తమ్మీద చూస్తే... తెలంగాణా ఏర్పాటు అంశంలో రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం సైలెంట్ మోడ్‌లో ఉండాల్సిందిగా కాంగ్రెస్ హైకమాండ్ నిర్దేశించినట్లు తెలుస్తోంది. ఈ పరిస్థితిలో తెలుగుదేశం కూడా కాంగ్రెస్ అనుసరిస్తున్న విధానాన్నే అనుసరించే అవకాశం లేకపోలేదు. ఇక మిగిలింది... తెరాస, భాజపా. ఈ రెండు పార్టీలు తెలంగాణా సాధనలో ఎటువంటి అడుగులు వేస్తాయో చూడాలి మరి.
========================
కనుచూపు మేరలోనే తెలంగాణ: ఆర్.దామోదర్ రెడ్డి
========================
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కనుచూపు మేరలో ఉందని ఆ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ నేత ఆర్.దామోదర్ రెడ్డి జోస్యం చెప్పారు. ఈ అంశంపై గురువారం కేంద్ర హోం మంత్రి చిదంబరం చేసిన ప్రకటన పూర్తి సంతృప్తినిచ్చిందన్నారు. ప్రస్తుతం ఢిల్లీలో మరో సీనియర్ నేత కె.జానారెడ్డితో కలిసి దామోదర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ మొదలైందని మరో ఆరు లేదా యేడాదిలో రాష్ట్ర ఏర్పాటు తథ్యమన్నారు. ఈ విషయంలో తమకు పార్టీ అధినేత్రి సోనియా గాంధీపై పూర్తి విశ్వాసం నమ్మకం ఉందన్నారు. తెలంగాణ అంశంపై ఉత్పన్నమైన తర్వాత తాజా పరిణామాలను సోనియాగాంధీకి తాము వివరించామని వారిద్దరు చెప్పారు. ఇకపోతే.. చిదంబరం ప్రకటనపై కాంగ్రెస్ ఎంపీల ఫోరం కన్వీనర్ పొన్నం ప్రభాకర్ స్వాగతించారు. నిజానికి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ గత డిసెంబర్ 9వ తేదీనే ప్రారంభమైందన్నారు.
========================================
చిదంబరం ప్రకటన సంతృప్తినివ్వలేదు: ప్రొ.కోదండరామ్ గురువారం, 28 జనవరి 2010( 15:53 IST )
========================================
కేంద్ర హోం మంత్రి చిదంబరం గురువారం చేసిన ప్రకటన ఏమాత్రం సంతృప్తిని ఇవ్వలేదని తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) కన్వీనర్ ప్రొఫెసర్ కోదండరామ్ స్పష్టం చేశారు. ఈ ప్రకటన తమను పూర్తిగా నిరాశపరించిందన్నారు. ఎందుకంటే.. ఇందులో నిర్ధిష్టమైన కాలపరిమితి లేదన్నారు. అలాగే, రాష్ట్ర ఏర్పాటుకు తాము కట్టుబడి ఉన్నామని విషయాన్ని కూడా ఎక్కడా ప్రస్తావించలేదని ఆయన చెప్పుకొచ్చారు. అందువల్ల జేఏసీ సమావేశంలో ఈ ప్రకటనపై చర్చించి, భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికను ఖరారు చేస్తామన్నారు.
తెలంగాణ అంశంపై వచ్చే నెలలో ఒక కమిటీని ఏర్పాటు చేయనున్నుట్టు హోం మంత్రి చిదంబరం ఢిల్లీలో ఒక ప్రకటన చేసిన విషయం తెల్సిందే. దీనిపై కోదండరామ్ పైవిధంగా స్పందించారు. కాగా, ఈ ప్రకటన పట్ల రాష్ట్రంలో మిశ్రమ స్పందన వ్యక్తం అవుతోంది. కాంగ్రెస్ నేతలు హర్షం వ్యక్తం చేస్తుండగా, తెలుగుదేశం, తెలంగాణ రాష్ట్ర సమితి నేతలు మాత్రం అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఈ కమిటీ ఏర్పాటు వల్ల కాలయాపన చేయడం మినహా ఒరిగేదేమి ఉండబోదన్నారు.
========================================
విద్యార్థి కుటుంబాలను వేధిస్తున్న ఖాకీలు: కోదండరామ్ గురువారం, 28 జనవరి 2010( 13:21 IST )
========================================
ప్రత్యేక రాష్ట్రం కోసం ఆత్మార్పణ చేసుకున్న విద్యార్థుల కుటుంబ సభ్యులను పోలీసులు వేధిస్తున్నారని తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) కన్వీనర్ ప్రొఫెసర్ కోదండరామ్ ఆరోపించారు. దీనిపై ఆయన హైదరాబాద్‌లో గురువారం మాట్లాడుతూ.. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఆత్మహత్య చేసుకున్న ఎంసీఏ విద్యార్థి వేణుగోపాల్ రెడ్డి కుటుంబ సభ్యులకు పోలీసులు బెదిరింపు ఫోన్‌కాల్స్ చేస్తున్నారని ఆరోపించారు. వ్యక్తిగత కారణాల వల్లే ఆత్మహత్య చేసుకున్నట్టు మీడియా ముందుకు వచ్చి చెప్పాల్సిందిగా వారిపై ఒత్తిడి తెస్తున్నట్టు కోదండరామ్ తెలిపారు. ఇలా చెపితే యాభై లక్షల రూపాయలు ఇస్తామని ప్రలోభపెడుతున్నారన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అనేక మంది విద్యార్థులు, రైతులు, సామాన్య ప్రజానీకం ఆత్మహత్యలకు పాల్పడుతున్నా వారి కుటుంబాలను ముఖ్యమంత్రి రోశయ్య పరామర్శించక పోవడానికి కారణమేమిటని కోదండరామ్ ప్రశ్నించారు.
===========================================
(సోర్సు : MSN NEWS)
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment