కేంద్రానికి పెద్ద తలనొప్పిగా మారిన ఆంధ్రప్రదేశ్ సంక్షోభానికి ఏదో విధంగా చరమ గీతం పాడాలని కాంగ్రెస్ హైకమాండ్ శతవిధాలా యత్నిస్తున్నట్లు కనబడుతోంది. తెలంగాణా "గండం" నుంచి ఆంధ్ర రాష్ట్రాన్ని గట్టెక్కించడమే కాక... పార్టీ పరువును కాపాడుకునేందుకు వ్యూహ రచన చేస్తోంది. ఇందులో భాగంగా సాధ్యమైనంత త్వరగా మంత్రివర్గ విస్తరణను చేయాలని సంకల్పిస్తోంది. ఈ విస్తరణలో తెలంగాణా గళాన్ని ఢిల్లీ వరకూ అత్యంత శక్తివంతంగా వినిపిస్తున్న కాంగ్రెస్ నాయకుడు, మాజీమంత్రి జానారెడ్డికి ఉపముఖ్యమంత్రి పదవి కట్టబెట్టాలని నిర్ణయించినట్లు సమాచారం. తెలంగాణాలో ఆగ్రహ జ్వాలలను అదుపు చేయాలంటే ఇటువంటి నిర్ణయాలు తప్పనిసరని కేంద్రం భావిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. కాగా డిప్యూటీ సీఎం రేసులో జానారెడ్డితో పాటు గీతారెడ్డి కూడా ఉన్నట్లు కాంగ్రెస్ శ్రేణులు అంటున్నాయి.
మొత్తమ్మీద తెలంగాణా జేఏసీ తమ డెడ్ లైన్‌ను ఫిబ్రవరి 7వ తేదీకి సవరించుకోవడంతో అంతకంటే ముందే మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ పేరిట తెలంగాణా ప్రాంతంలో కాస్తంత స్వాంతన చేకూరే చర్య చేపట్టాలని కేంద్రం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ జానారెడ్డి ఉపముఖ్యమంత్రి పదవికి ఓకే చెబితే తెలంగాణా ఉద్యమ రూపం ఎలా మారుతుందో చూడాల్సిందే...!!
============================
మీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే మేమెందుకు..?: టికాంగ్రెస్
============================
ప్రత్యేక తెలంగాణా సాధనకు గత నెల 24వ తేదీన పార్టీలకు అతీతంగా తెలంగాణాలో ఏర్పాటైన తెలంగాణా జేఏసీలో ముసలం పుట్టింది. దీనికి కారణాలు అనేకం. తెలంగాణా ప్రాంతంలోని కొంతమంది కాంగ్రెస్ నాయకులను టార్గెట్ చేస్తూ దాడులు జరగడమే కాక, అధినేత్రి సోనియా గాంధీని తెలంగాణా జేఏసి నాయకులు తమ ఇచ్చమొచ్చిన రీతిలో విమర్శించడం... వంటివెన్నో ఈ చీలకకు కారణమవుతున్నాయి. జేఏసీలో ఉన్న తెరాస, తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రత్యక్షంగా కాంగ్రెస్‌పై విమర్శలు చేస్తున్నా, అదే జేఏసీలో ఉన్న కాంగ్రెస్ నాయకులు ఏమీ మాట్లాడలేని దుర్భర స్థితి. దీంతో తెలంగాణా కాంగ్రెస్ నాయకులు పరిస్థితిని గమనించి టీజేఏసీ పడవ నుంచి కిందికి దిగడానికి దాదాపు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది.
తాము జేఏసీలో కొనసాగాలంటే పెద్దన్న పాత్ర తమకే ఇవ్వాలనీ, ఎవరు పడితే వారు మాట్లాడకూడదన్న భావనలో కాంగ్రెస్ పార్టీ ఉన్నట్లు సమాచారం. పైగా తెలంగాణా అంశంపై ఎవరికి తోచింది వారు మాట్లాడుతుండటంతో ఉద్యమం పక్కదోవ పడుతుందని అందువల్ల దాన్ని సక్రమ మార్గంలో పెట్టాలంటే జేఏసీకి ఒక కమిటీ ఆవశ్యకత ఎంతైనా ఉన్నదని కాంగ్రెస్ అభిప్రాయపడుతున్నట్లు విశ్వసనీయ సమాచారం.
వీటన్నిటికీ మించి తెలంగాణా సాధనలో కీలక పాత్ర తమదేనన్న గుర్తింపు రావాలని కాంగ్రెస్ తహతహలాడుతోంది. కానీ ఇది కార్యరూపంలో ఎక్కడా కనిపించకపోగా కాంగ్రెస్ పార్టీ నాయకులే తెలంగాణాకు వ్యతిరేకులుగా చిత్రీకరణ జరుగుతోంది. ఈ నేపధ్యంలో తీక్షణంగా ఆలోచించిన తెలంగాణా కాంగ్రెస్ పార్టీ నాయకులు జేఏసీ నుంచి "ఎస్కేప్" అవ్వాలని నిర్ణయించుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. కాంగ్రెస్ ఆలోచనను తెలుసుకున్న జేఏసీ కన్వీనర్ కోదండరామ్... వారిని చల్లబరిచే ప్రయత్నాలు చేస్తున్నారు. మొత్తానికి తెలంగాణా జేఏసీ పరిస్థితి "ఏ నిమిషానికి ఏమి జరుగునో.." అన్నట్లుగా ఉన్నది.
=========================
అటు పీఆర్పీ... ఇటు తెరాస తన్నుకెళ్తాయి జాగ్రత్త!!
=========================
గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో చోటుచేసుకున్న పరిస్థితులను కాంగ్రెస్ హైకమాండ్ పూర్తిస్థాయిలో మధింపు చేసి ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. దీని ఫలితంగానే కేంద్రమంత్రి చిదంబరం నోట వెంట కమిటీ ప్రకటన వచ్చినట్లు రాజకీయ విశ్లేషకులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అంతకుముందు పలు దఫాలుగా కాంగ్రెస్ హైకమాండ్ తెలంగాణా- సీమాంధ్రలకు చెందిన కాంగ్రెస్ నాయకులతో విస్తృత చర్చలు జరిపింది. ఏ విషయంపై చర్చించి ఉండవచ్చన్న విషయాన్ని ప్రక్కనపెడితే తమ కన్నునే తాము పొడుచుకునే విధంగా ఆంధ్రప్రదేశ్‌లోని కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు అక్కడి ప్రభుత్వాన్ని కూలదోసే దిశగా అడుగులు వేయరాదని హెచ్చరించినట్లు తెలుస్తోంది. ఒకవేళ పార్టీ హైకమాండ్ మాటను పట్టించుకోకుండా జేఏసీ మాటకు కట్టుబడి రాష్ట్రంలో తెలంగాణా ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు మంకుపట్టుతో పదవులకు రాజీనామాలు చేస్తే ప్రభుత్వం సంక్షోభంలో పడిపోవడం ఖాయం. ఫలితంగా ఎన్నికలకు వెళ్లక తప్పదు. ఒకవేళ ఎన్నికలు వస్తే ఏం జరుగవచ్చు...?
ప్రధాన రాజకీయ పార్టీలైన కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల సంగతి ప్రక్కనపెడితే... తెలంగాణాలో తెరాస, సీమాంధ్రలో ప్రజారాజ్యం పుంజుకునే అవకాశం ఉంది. ఎందుకంటే... తెలంగాణా కావాలని తెరాస కుండబద్ధలు కొట్టినట్లు చెపుతోంది. అదేవిధంగా సమైక్యవాదమే తమ వాదమని చిరంజీవి నేతృత్వంలో ప్రజారాజ్యం గట్టిగా వాదిస్తోంది. ఈ పరిస్థితుల్లో ఎన్నికలకు వెళితే... తెరాస- పీఆర్పీ కలిసి అధికార కాంగ్రెస్ పార్టీ స్థానాలను గల్లంతు చేసే అవకాశం లేకపోలేదని విశ్లేషకుల అభిప్రాయం. కనుక ఈ పరిస్థితిలో పార్టీనే కాక ప్రభుత్వాన్ని మరింత పటిష్టపరచుకోవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. కనుక కాంగ్రెస్ హైకమాండ్ రాష్ట్ర కాంగ్రెస్ నాయకులకు హితోపదేశం చేసి తెలంగాణా సమస్యను "మాకు వదిలేయండి.. మేం చూసుకుంటాం.." అని చెప్పినట్లు అర్థం చేసుకోవచ్చు.
ఏతావాతా తెలుస్తున్నదేమిటంటే... ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఐక్యంగా ఉండాలని హైకమాండ్ ఆకాంక్షిస్తున్నది. వారు ఆశిస్తున్నట్లు పరిణామాలు కూడా జరుగుతున్నట్లు కనిపిస్తోంది.
========================
(source: MSN News)
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment