రాష్ట్రంలో పరిస్థితులు చక్కబడేంత వరకు ఏ ఒక్కరూ తెలంగాణ అంశం గురించి మాట్లాడవద్దని కాంగ్రెస్ హైకమాండ్ ఖరాకండిగా తేల్చి చెప్పింది. శాంతిభద్రతలు పూర్తిగా అదుపులోకి వచ్చిన తర్వాతే సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని పార్టీ అధినేత్రి సోనియాగాంధీ స్పష్టం చేసినట్టు ఢిల్లీ వర్గాల హస్తినలో మకాం వేసి ఉన్న ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్‌తో మేడమ్ ఇదే విషయాన్ని తేల్చి చెప్పినట్టు వినికిడి. సమావేశం అనంతరం డీఎస్ మీడియాతో మాట్లాడుతూ.. ఇదే అంశాన్ని పదే పదే ప్రస్తావించారు. తెలంగాణకు ప్రత్యేక రాష్ట్ర హోదా కల్పించాలన్న అంశానికి కాంగ్రెస్ అజెండా అత్యధిక ప్రాధాన్యం ఇస్తోందన్నారు. అంతేకాక ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలన్న నిశ్చయంతో పార్టీ హైకమాండ్ ఉందని ఆయన ఉద్ఘాటించారు. దీనిపై తుది నిర్ణయం తీసుకోవడానికి రాష్ట్ర శాంతి భద్రతల పరిస్థితి ప్రధాన అవరోధంగా నిలుస్తోందన్నారు. అందువల్ల పరిస్థితులు చక్కబడితే అన్నీ సర్దుకుంటాయని, ఆ తర్వాత సమస్య పరిష్కారానికి చర్యలు చేపడుతామని మేడమ్ హామీ ఇచ్చినట్టు డీఎస్ వెల్లడించారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు గంటలో సాధ్యం కాదన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకుని, నడుచుకోవాలని శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు.
ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్ తన హస్తిన యాత్రను ముగించుకుని రాష్ట్ర రాజధాని భాగ్యనగరానికి చేరుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో దిగీదిగగానే మీడియా చుట్టిముట్టి ఢిల్లీ యాత్రపై ప్రశ్నల వర్షం గుప్పించింది. 'కదలడు.. మెదలడు' అనే రీతిలో వ్యవహరించే డీఎస్.. మీడియా ప్రశ్నలకు ఎప్పటిలా నోరెళ్ళపెట్టి తాపీగా సమాధానం ఇచ్చారు. ఏ నిమిషానికి ఏం జరుగునే ఎవరికి ఎరుక అంటూ వేదాంత ధోరణిలో జవాబిచ్చారు. భవిష్యత్‌లో జరగాల్సినవి జరుగుతాయని.. తెలుగుజాతి సంతోషంగా ఉంటుందని సెలవిచ్చారు. రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులపై పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి అన్ని వివరించారని చెప్పారు. సమస్యను అధిష్టానానికి వదిలి వేసి రాష్ట్ర అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన కాంగ్రెస్ పార్టీ నేతలకు, శ్రేణులకు పిలుపునిచ్చారు. అన్ని ప్రాంతాల ప్రజలు మెచ్చేలా ఏ నిర్ణయమైనా ఉంటుందన్నారు. అయితే, ఎప్పటిలోగా ప్రకటన రావొచ్చనేదానిపై ఆయన ఖచ్చితమైన సమాచారం ఇవ్వలేదు. నం ఊహించుకున్నట్టు జరుగుతాయా అని ప్రశ్నించారు. ఎపుడు జరగాల్సింది అపుడు జరుగుతుందన్నారు. తన ఢిల్లీ పర్యటన పట్ల డీఎస్ సంతృప్తి వ్యక్తం చేశారు. కాగా, డీఎస్‌పై సీమాంధ్ర నేతలు గుర్రుగా ఉన్న విషయం తెల్సిందే. తెలంగాణ ప్రాంతానికి చెందిన డీఎస్.. రాష్ట్ర పీసీసీ చీఫ్‌గా కాకుండా తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment