---------------------------------------------------------------------------------------------
తెలంగాణా రాష్ట్రము ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రకటన ఇచ్చి 24 గంటలు గడవక ముందే ఆంధ్ర ప్రజాప్రతినిధులు రాజీనామా అస్త్రాలని ప్రయోగించడం మొదలు పెట్టారు. అసెంబ్లీ సమావేశం కాకపోతే తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు తీర్మానం అవదు. దాని కారణంగా తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుని వ్యతిరేకించ వచ్చని వాళ్ళ అభిప్రాయం. చాల మంది రాజకీయ నాయకులకి రెండు నాలుకలు ఉంటాయని అందరికి తెలిసిందే. అయితే టీవీ చానెళ్ళ పుణ్యమా అని వారి అంతరంగం బట్టబయలు అవుతోంది. తీర్మానానికి సిద్దమన్న పార్టీల నాయకుల నిజ స్వరూపం, తెలంగాణా వ్యతిరేకత ఈ రెండు రోజుల్లో మరోసారి బహిర్గతమైంది.
తెలంగాణా ప్రక్రియ మొదలైంది. హైదరాబాదు తెలంగాణాకి రాజధాని అని కేంద్ర హోంశాఖ కార్యదర్శి పిళ్ళై స్పష్టం చేయడం ద్వారా తెలంగాణా ఏర్పాటు పట్ల కేంద్ర ప్రభుత్వ ధృడ వైఖరి స్పష్టమవుతోంది. ఈ నేపథ్యంలో చాలా మంది ఒక ప్రశ్న తరచూ వేస్తున్నారు. కొత్త రాష్ట్రాల ఏర్పాటుకి ఆ రాష్ట్రాల అసెంబ్లీ తీర్మానం అవసరమా? తీర్మానం చేయకపోతే పరిస్థితి ఏమిటి? ఈ విషయంలో పార్లమెంట్ అధికారాలు ఎలా వున్నాయి? ఇవి ప్రశ్నలు.
రాజ్యాంగంలోని ఆర్టికల్ ౧ ప్రకారం భారతదేశం రాష్ట్రాల సమూహం. (ఉనిఒన్ అఫ్ స్టేట్స్). ఈ రాష్ట్రాల సమూహం కలిసి సార్వభౌమ ప్రజాస్వామ్య గణతంత్ర భారతదేశం ఏర్పడిందని ఇది స్పష్టం చేస్తుంది. ఈ రాష్ట్రాల యూనియన్ ఒప్పందాల ద్వారా ఏర్పడింది కాదు. ఇది సమాఖ్య కాదు. సమాఖ్య స్వభావం ఉన్న యూనియన్. దీనిని సమాఖ్యగా గుర్తించ కూడదన్న డ్రాఫ్టింగ్ కమిటి సూచనను రాజ్యాంగ అసెంబ్లీ ఆమోదించింది.
'మన రాజ్యాంగం సమాఖ్య స్వభావం కలిగి ఉన్నప్పటికీ ఇది సమాఖ్య కాదు. ఇది యూనియన్. యునియన్ అనడం వాళ్ళ కొన్ని లాభాలు ఉన్నాయి. అమెరిక ఫెదరతిఒన్ మాదిరిగా ఒక ఒప్పందం ద్వారా యూనియన్ అఫ్ ఇండియా ఏర్పడ లేదు. ఆ కారణంగా ఏదయినా రాష్ట్రం విడిపోయే అవకాశం లేదు. ఈ కారణాలవల్లనే దీన్ని యూనియన్ అని అంటున్నాం.' అన్నారు Dr అంబేద్కర్.
పరిపాలనా సౌలభ్యానికి భారతదేశాన్ని రాష్ట్రాలుగా విభజించవచ్చు. ఆ విధంగా అవి ఏర్పడవచ్చు. కాని అవి అన్ని భారతదేశంలోని అంతర్భాగాలు. మొదటి షెడ్యూల్ లో ఉదాహరించిన రాష్ట్రాలు, యూనియన్ ప్రాంతాలు అన్ని భారతదేశంలోని అంతర్భాగాలు. ఇప్పుడు మన దేశం లో ఉన్న భూభాగాలు రెండు రకాలుగా ఉంటాయి. అవి రాష్ట్ర్రలీ,
కేంద్ర పాలిత ప్రాంతాలు. ఇప్పుడు మన దేశంలో 28 రాష్ట్రాలు, 7 కేంద్ర పాలిత ప్రాంతాలు ఉన్నాయి. ఇవి కాకుండా వేరే ప్రాంతాలని కూడా భారతదేశం స్వాధీనం చేసుకోవచ్చు. అవి దేశంలోని అంతర్భాగం అవుతాయి. దాని కోసం ప్రత్యేకమయిన చట్టం అవసరం లేదు.
భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 2 ప్రకారం, ఉచితమని భావించినప్పుడు షరతుల మీద నూతన రాష్ట్రాలను చేర్చుకోనవచ్చును. స్థాపించవచ్చు. పార్లమెంటుకి ఈ రెండు అధికారాలు ఉన్నాయి. నూతన రాష్ట్రాలను యూనియన్లో చేర్చుకోవచ్చు. అదే విధంగా నూతన రాష్ట్రాలని ఏర్పాటు చేయవచ్చు. ఇదివరకే ఉన్న రాష్ట్రాలని చేర్చుకోవడం మొదటిదాని అర్థం. ఇదివరకులేని రాష్ట్రాలని ఏర్పాటు చేయడం రెండవ దాని అర్థం. ఆర్టికల్ ౨ ప్రకారం ఇదివరకులేని రాష్ట్రాలని ఏర్పాటు చేయడం, షరతుల మీద నూతన రాష్ట్రాలను భారత పార్లమెంటు చేర్చుకోనవచ్చును.అదే విధంగా నూతన రాష్ట్రాలని ఏర్పాటు చేయవచ్చు.
తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు ఆర్టికల్ 2 పరధిలోకి రాదు.
ఆర్టికల్ 3 ప్రకారం - కొత్త రాష్ట్రాన్ని ఈ విధంగా చేయవచ్చు. - అవి - 1 ) ఏదైనా రాష్ట్ర భూభాగాన్ని వేరు చేసి. 2 ) రెండు లేదా మూడు రాష్ట్రాలని కలిపి. 3 )రాష్ట్రాలలోని భాగాలని కలిపి. 4 ) ఏదైనా ప్రాంతాన్ని ఏదైనా రాష్ట్రంలోని ప్రాంతంలోని కలిపి. ఈ ఆర్టికల్ ప్రకారం, ఏదైనా రాష్ట్ర భూభాగాన్ని పెంచవచ్చు. లేదా తగ్గించవచ్చు. లేదా హద్దులను మార్చవచ్చు. అదే విధంగా రాష్ట్రము పేరును కూడా మార్పు చేయవచ్చు. ఇదివరకే ఉన్న రాష్ట్రాల భూభాగాల నుంచి కొత్త రాష్ట్రం ఏర్పాటు గురుంచి తెలియచేసే నిభందన ఆర్టికల్ ౩. రాష్ట్ర సమ్మతి లేకుండా, ఆ రాష్ట్రం ఏకీభావం లేకుండా, రాష్ట్రాల భూభాగాలను పంచె అధికారం, తగ్గించే అధికారం, హద్దులను మార్పు చేసే అధికారం, పేరు మార్చే అధికారం, భారత పార్లమెంటుకు ఉంది. ఈ విధంగా చేయడానికి పార్లమెంటులో సాధారణ మెజారిటీ సరిపోతుంది. అయితే ఇలాంటి శాసనం చేయటానికి రెండు షరతులు ఉన్నాయి.
1 ) ఇందుకు సంబంధించిన బిల్లును రాష్ట్రపతి సిఫారసు లేకుండా పార్లమెంటు ఉభయ సభల్లో పెట్టడానికి వీల్లేదు.
2 ) ఏవైనా రాష్ట్రాల హద్దులను, పేర్లను ఆ బిల్లు మార్చుతున్నపుడు, ఆ విధంగా ప్రమేయం ఉన్న అన్ని శాసనసభలకు ఆ బిల్లుపై వారి అభిప్రాయం ఒక నిర్ణయించిన కాలం లోపల అందచేయ వలసిందిగా రాష్ట్రపతి కోరవలసి ఉంటుంది. ఈ కాలపరిమితిని రాష్ట్రపతి పొడిగించే అవకాశం ఉంది.
రాష్ట్రపతి నిర్దేశించిన కాలపరిమితి లోగా లేదా పొడిగించిన కాలపరిమితి లోగా ఆ రాష్ట్రాల శాసన వ్యవస్థలు తమ అభిప్రాయాలను తెలియజేయాల్సి ఉంటుంది. ఆ శాసన సభలు తమ అభిప్రాయాలను తెలియపరచనప్పుడు కూడా, ఆ బిల్లును పార్లమెంటులో ప్రవేశ పెట్టవచ్చును. అదే విధంగా, బిల్లుకి వ్యతిరేకంగా ఆ రాష్ట్ర శాసన సభలు తమ అభిప్రాయాలను తెలియ పరచినప్పుడు కూడా, యా బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టే అధికారాన్ని ఆర్టికల్ ౩ కల్పిస్తుంది.
శాసన సభలో వ్యక్తపరిచిన అభిప్రాయాలతో సంబంధం లేకుండా కొత్త రాష్ట్ర బిల్లును కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ప్రశాపెట్ట వచ్చు. ఈ విషయాన్ని ఆర్టికల్ స్పష్టం చేస్తున్నది. ఈ అభిప్రాయాన్ని సుప్రీంకోర్టు బాబులాల్ VS స్టేట్ అఫ్ బొంబాయి AIR 1960 SC 51 కేసులో వ్యక్తం చేసింది. అంతేకాదు- ఆ రాష్ట్రాల అభిప్రాయం కోసం మల్లి ఆ బిల్లును తిరిగి పంపించాల్సిన అవసరం లేదు. కొత్త రాష్ట్రాల ఏర్పాటు, ఉన్న రాష్ట్రాల ఉనికి కేంద్ర ప్రభుత్వం మీద ఆధారపడి ఉంది. పర్లమేన్తుమీద ఆధారపడి ఉంది. ఈ బిల్లు ఆమోదానికి కావాల్సింది సాధారణ మెజారిటి మాత్రమే. ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్ ౩ సారాంశం.
తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు, తెలంగాణా ప్రజల చిరకాల కాంక్ష. 60 సంవస్తరాల నుంచి వాళ్ళు ఎదురు చూస్తున్న రోజు. చిదంబరం ప్రకటనకు ఒక రోజు ముందు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన వ్విధ పార్టీల floor లీడర్ల సమావేశంలో మజ్లిస్ మినహా అన్ని పార్టీలు అసెంబ్లీ తీర్మానానికి సముఖత ప్రకటించాయి. CPM తటస్థ వైఖరిని అవలంబించింది. CLP తన నిర్ణయాన్ని అధిష్టానానికి అప్పగించింది. అధిష్టానం అనుకూల నిర్ణయం తీసుకుంటే దానికి రాష్ట్రం నుంచి వ్యతిరేకత రాదన్న అభిప్రాయాన్ని అందరూ కలిగించారు. ప్రకటన వెలువడిన తరువాత రాజీనామాలు, తిరుగుబాట్లు చేస్తున్నారు. రెండు నాలుకల ధోరణిని తెలంగాణా ప్రజలే కాదు, దేశమంతా గమనిస్తున్నది. దీనివల్ల ఆయా నాయకుల, పార్టీల విశ్వసనీయత పోతుంది.
ఇక్కడ గమనించవలసిన అంశం- తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుకు, ఆమాటకొస్తే, ఏ రాష్ట్ర ఏర్పాటుకి అసెంబ్లీ తీర్మానం అవసరం లేదు.
అసెంబ్లీ వ్యతిరేకించినా కొత్త రాష్ట్రాల ఏర్పాటు చేసే అధికారం పార్లమెంటుకి ఉంది. దానికి కావాల్సింది సాధారణ మెజారిటి మాత్రమే.
ఈ సత్యాన్ని మరియు తెలంగాణా ప్రజల చిరకాల ఆకాంక్షని గుర్తించి తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుకు అందరూ సహకరించాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా చేయకపోతే వాళ్ళు చరిత్రహీనులవుతారు. భారత రాజ్యాంగంలోని అధికరణల ప్రకారం, భారతదేశ పౌరుడు ఎక్కడయినా స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవచ్చు. ఆస్తిని సమ కూర్చికోవచ్చు. అందుకని ఆందోళనలు వద్దు. అందరం ఆనందంగా వేరుగా ఉంటూ కలిసి ఉందాం. (హిమవంత్ రెడ్డి )
No comments:
Post a Comment